
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆల్ మేవా) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు షెక్షావలి డిమాండ్ చేశారు. ఆల్‌మేవా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ వై.ఫకృద్ధీన్ అధ్యక్షతన ఆదివారం అనంతపురంలోని లిటిల్‌ఫ్లవర్ స్కూల్‌లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16 నెలలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటి వరకూ 12వ పీఆర్సీ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను వెంటనే విడుదల చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు. జిల్లా ప్రధానకార్యదర్శి ఫారూక్ మహమ్మద్ మాట్లాడుతూ.. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు. కారుణ్య నియమాకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ, డీఏ అందని ద్రాక్షలా మారాయని వాపోయారు. సమావేశంలో ఆల్‌మేవా నాయకులు ఫరూఖ్, ఫకృద్దిన్, అన్వర్, రసూల్, అస్రఫ్‌అలి, దౌలా, రఫి, మహబూబ్‌బాషా, సర్దార్ పాల్గొన్నారు.
‘ఆల్‌మేవా’ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు షెక్షావలి