
పెండింగ్ మాట వినిపించొద్దు
● అధికారులకు కలెక్టర్ ఆనంద్
స్పష్టమైన ఆదేశాలు
అనంతపురం అర్బన్: ‘‘నిర్దే శించిన అంశాలకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తి కావాలి. ఏ అంశంలోనూ పెండింగ్ మాట వినిపించకూడదు’’అని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. చుక్కల భూముల ఫైళ్ల పరిష్కారం, ఉద్యోగులకు ఏడాదిన్నరగా పదోన్నతుల కల్పనలో జరుగుతున్న జాప్యంపై ‘సాక్షి’లో ఈనెల 17న, 21వ తేదీన ‘‘సారూ... దృష్టి సారించండి’’, ‘‘కొత్తసారుపై.. కొండంత ఆశ’’ శీర్షికన ప్రచురితమైన కథనాలపై కలెక్టర్ స్పందించారు. పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బందితో ఆయన రెండు రోజులుగా ప్రత్యేకంగా సమావేశమై తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చారు.
ఆదేశాలు ఇలా..
● 22ఏ (నిషేధిత భూములు) జాబితాలోని భూములకు సంబంధించిన ఫైళ్లను పరిష్కరించాలి. చెక్‌లిస్ట్ ప్రకారం ఫైలును పక్కాగా సిద్ధం చూసి ఆమోదం కోసం ఉంచాలి. తిరస్కరణకు గురయ్యే వాటిని ఉంచకూడదు. 22ఏ ప్రత్యేక డ్రైవ్ కింద మొదటి విడతగా 487 ఫైళ్లు పరిశీలించి క్లియర్ చేయాలి. 10 రోజుల తర్వాత రెండో విడత చేపట్టి 500 ఫైళ్లు క్లియర్ చేయాలి. 22ఏ జాబితా నుంచి భూమి తొలగించాలంటూ పరిష్కార వేదికలో ఇక నుంచి ఫిర్యాదులు రాకూడదు.
● నిబంధనల ప్రకారం ఉన్న డాటెడ్ ల్యాండ్ (చుక్కల భూములు) ఫైళ్లు క్లియర్ చేయాలి. చెక్‌లిస్ట్ ప్రకారం ఫైళ్లను సిద్ధం చేసి ఆమోదం కోసం ఉంచాలి. ఏ దశలోనూ నిర్లక్ష్యం, అవినీతికి తావివ్వకూడదు. చిన్నపాటి ఫిర్యాదు కూడా రాకూడదు.
● కారుణ్య నియామకాల విషయంలో నిర్లక్ష్యం సరికాదు. ఎప్పటికప్పుడు ఫైళ్లను ఉంచాలి. నెల రోజుల వ్యవధిలో కారుణ్య నియామకాలు కల్పించాలి. ఇందుకు సంబంధించిన ఫైళ్లను ఆమోదం కోసం ఉంచండి.
● ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషయంలో జాప్యం చేయకూడదు. ఇందుకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసి ఆమోదం కోసం ఉంచండి. ప్రతీదీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి.