
20 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో తేలికపాటి వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 20 మండలాల పరిధిలో 2.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. విడపనకల్లు 11.8 మి.మీ, గుత్తి 10.8 మి.మీతో పాటు మిగతా మండలాల్లో తేలికపాటి నుంచి తుంపర్లు పడ్డాయి. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 110.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 84 మి.మీ నమోదైంది. ఓవరాల్‌గా జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 303.4 మి.మీకి గానూ 9.6 శాతం అధికంగా 332.5 మి.మీ నమోదైంది. ఈ సీజన్‌లో 28 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. 11 మండలాల్లో సాధారణం కన్నా అధికంగానూ, 17 మండలాల్లో సాధారణం, మిగతా మూడు మండలాల్లో తక్కువగా వర్షాలు కురిశాయి. ఆదివారం కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
పయ్యావుల ఇలాకాలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
● 21 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
ఉరవకొండ/ ఉరవకొండ రూరల్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత ఇలాకాలో భారీ పేకాట స్థావరంపై ఉరవకొండ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. 21 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. పయ్యావుల సొంత పంచాయతీ అయిన ఉరవకొండ మండలం పెద్దకౌకుంట్ల పరిధిలోని మైలారంపల్లి వద్ద వ్యవసాయ క్షేత్రంలో భారీఎత్తున పేకాట స్థావరం నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఉరవ కొండ అర్బన్ సీఐ మహానంది ఆధ్వర్యంలో పోలీసులు శనివారం రాత్రి వ్యవసాయ క్షేత్రాన్ని చుట్టుముట్టారు. 21 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.77 వేల నగదు, 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లను స్టేషన్‌కు తరలించి..కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ చేస్తున్నామని, నిర్వాహకులు ఎవరన్నది విచారణలో తేలాల్సి ఉందని సీఐ మహనంది తెలిపారు.
ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం
బుక్కరాయసముద్రం: ఎంపీపీ సునీతపై వైఎస్సార్ సీపీ మద్దతుదారులు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కేశవ నాయుడుకు 12 మంది ఎంపీటీసీలు, వైఎస్సార్ సీపీ నాయకులు నోటీసు అందజేశారు. మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్సార్ సీపీ సభ్యులు 13 మంది ఉన్నారు. వైఎస్సార్ సీపీ గుర్తుతో గెలిచి టీడీపీలోకి చేరిన ఎంపీపీ సునీతపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని 13 మంది ఎంపీటీసీలు నిర్ణయించుకుని నోటీసును ఆర్డీఓకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు కాలువ వెంకటలక్ష్మి, నామాల శిరీష, బుల్లే సుజాత, వడ్డే రాజ్యలక్ష్మి, భాస్కర్ రెడ్డి, రాం గోపాల్, ఎర్రినాగప్ప, అంజినరెడ్డి, సాకే జయలక్ష్మి, శివారెడ్డి, కుళ్లాయప్ప, రామచంద్ర, నాగయ్య తోపాటు జెడ్పీటీసీ భాస్కర్, చికెన్ నారాయణస్వామి, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
రేపు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్‌లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం ఉంటుందని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో తెలియజేయాలని సూచించారు. అర్జీతో పాటు ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే రసీదు తీసుకురావాలని సూచించారు.