బీకేఎస్‌ ఎంపీపీపై అవిశ్వాసం! | - | Sakshi
Sakshi News home page

బీకేఎస్‌ ఎంపీపీపై అవిశ్వాసం!

Sep 27 2025 4:51 AM | Updated on Sep 27 2025 4:51 AM

బీకేఎస్‌ ఎంపీపీపై అవిశ్వాసం!

బీకేఎస్‌ ఎంపీపీపై అవిశ్వాసం!

కలెక్టర్‌, జెడ్పీ డిప్యూటీ సీఈఓలకు విన్నవించిన ఎంపీటీసీలు

అనంతపురం సిటీ/ బుక్కరాయసముద్రం: పార్టీ కట్టుబాటు తప్పి.. నమ్మకద్రోహం చేసిన బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీతపై వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం కలెక్టర్‌ ఆనంద్‌, జెడ్పీ డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్యను వేర్వేరుగా కలిసి విన్నవించారు. బుక్కరాయసముద్రం మండలంలో మొత్తం 19 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో 14 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందగా, ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. బుక్కరాయసముద్రం–2 స్థానం నుంచి గెలుపొందిన దాసరి సునీతకు ఎంపీపీ పగ్గాలు అప్పగించారు. అప్పట్లోనే ఒక ఒప్పందం కుదిరింది. మొదట ఎంపీపీ పగ్గాలు చేపట్టిన వారు రెండేళ్లు, ఆ తరువాత అధికారం చేపట్టే వారు మూడేళ్లు ఎంపీపీగా కొనసాగాలని ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి కట్టుబడి దాసరి సునీత తొలిసారి ఎంపీపీ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లు గడిచిన తర్వాత మరో ఆరు నెలలు తనకు అవకాశం కల్పించాలని కోరగా.. వైఎస్సార్‌సీపీ పెద్దలు సరేనన్నారు. ఆ గడువు ముగియగానే బుక్కరాయసముద్రం–1 ఎంపీటీసీ సభ్యురాలు కాలువ వెంకటలక్ష్మికి ఎంపీపీ పగ్గాలు అప్పగించాలి. అయితే దాసరి సునీత పదవి నుంచి తప్పుకోకుండా దాటవేస్తూ వచ్చారు. దీంతో మిగిలిన సభ్యులు ఆమెను వ్యతిరేకించారు.

పార్టీ ఫిరాయింపుతో అసలుకే ఎసరు

ఒప్పందం మేరకు ఎంపీపీ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని రాజకీయ విలువలు కాపాడాలని మిగిలిన సభ్యులు సునీతకు సూచిస్తూ వచ్చారు. అయితే వాటిని ఆమె పెడచెవిన పెట్టడమే గాక ఏకంగా పార్టీ ఫిరాయించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె టీడీపీలోకి చేరిపోయారు. దీంతో టీడీపీ ఎంపీటీసీ సభ్యుల సంఖ్య ఆరుకు చేరగా, వైఎస్సార్‌సీపీ సభ్యుల సంఖ్య 13కు చేరింది. ఇప్పటికీ వైఎస్సార్‌సీపీకే స్పష్టమైన మెజారిటీ ఉంది. అయినా ఎంపీపీ సునీత పదవి వీడకుడా మొండిగా వ్యవహరిస్తున్నారు.

అవిశ్వాస తీర్మానానికి పట్టు

ఎంపీపీ సునీతపై తక్షణం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఎంపీటీసీ సభ్యులు మూకుమ్మడిగా వైఎస్సార్‌సీపీ పెద్దల దృష్టికి తెచ్చారు. ఇదే అంశంపై పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, శింగనమల సమన్వయకర్త సాకే శైలజానాథ్‌తో రెండు రోజులపాటు మంతనాలు జరిపారు. వారి సూచన మేరకు శుక్రవారం ఎంపీటీసీ సభ్యులు నామాల శిరీష (బీకేఎస్‌–4), బుల్లే సుజాత (బీకేఎస్‌–5), వడ్డే రాజ్యలక్ష్మి (బీకేఎస్‌–6), భాస్కర్‌రెడ్డి (రేగడ కొత్తూరు), రాంగోపాల్‌(వడియంపేట), ఎర్రినాగప్ప (గోవిందంపల్లి), అంజినరెడ్డి (చెదళ్ల), సాకే జయలక్ష్మమ్మ (రెడ్డిపల్లి), శివారెడ్డి (దయ్యాలకుంట్లపల్లి), కుళ్లాయప్ప (వెంకటాపురం), రామచంద్ర (కె.కె.అగ్రహారం), నాగయ్య (చెన్నంపల్లి) అనంతపురానికి చేరుకున్నారు. ముందుగా డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్యను కలసి అవిశ్వాస తీర్మానం కోసం వినతిపత్రమందించారు. ఆ తర్వాత జెడ్పీ క్యాంప్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మను కలిసి, చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులతో పాటు జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్‌, సర్పంచులు పార్వతి, శ్రీనివాసరెడ్డి, ఎర్రిస్వామి, వైఎస్సార్‌సీపీ బుక్కరాయసముద్రం మండల శాఖ అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు ముసలన్న, మల్లికార్జున, పూల నారాయణస్వామి, పురుషోత్తం, చికెన్‌ నారాయణస్వామి తదితరులు విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యమన్నారు. ఒప్పందం ఉల్లంఘించిన దాసరి సునీత ఎంపీపీ పదవిలో ఉండటానికి ఏమాత్రమూ అర్హురాలు కాదన్నారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌ ఆనంద్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. శనివారం అనంతపురం ఆర్డీఓ గుత్తా కేశవనాయుడును కలిసి అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement