
పప్పుశనగ కేటాయింపులకు కత్తెర
● రబీ విత్తన పంపిణీపై స్పష్టత కరువు
● గత ఏడాది 28వేల క్వింటాళ్ల విత్తనం
● ఈసారి 14వేల క్వింటాళ్లకు కుదింపు
అనంతపురం అగ్రికల్చర్: నల్లరేగడి భూముల్లో రబీ పంటగా పప్పుశనగ సాగు చేసే రైతులకు రాయితీ విత్తనం ఎపుడు ఇస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. అక్టోబర్ ఒకటి నుంచి రబీ మొదలు కానున్నా... విత్తనానికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ ప్రారంభించలేదు. మరోపక్క ఈసారి జిల్లాకు విత్తన కేటాయింపుల్లో కూటమి ప్రభుత్వం కత్తెర వేసినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది 28 వేల క్వింటాళ్లు విత్తన పప్పుశనగ జిల్లాకు కేటాయించారు. అయితే ఈసారి 14 వేల క్వింటాళ్లకు కుదించినట్లు తెలుస్తోంది. దీంతో వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ అధికారులు కాస్తంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కేటాయింపులు పెంచాలని మరోసారి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీంతో పంపిణీ ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు. గతంలో 2019–24 మధ్య వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏటా రబీలో 40 శాతం రాయితీతో అక్టోబర్ మొదటి వారంలోనే విత్తన పప్పుశనగ సాఫీగా అందించింది. కానీ కూటమి సర్కారు గత రబీలో రాయితీకి కూడా కొర్రీలు వేసింది. 40 శాతం ఉన్న రాయితీని 25 శాతానికి తగ్గించడంతో జిల్లా రైతులపై రూ.5 కోట్లకు పైగా అదనపు భారం పడింది. ఈసారైనా రాయితీ పెంపు చేస్తారా లేదంటే 25 శాతంతోనే ఇస్తారా అనేది స్పష్టత రాలేదు.
విత్తనం కోసం ఎదురుచూపు
రబీ సమీపిస్తుండటంతో నల్లరేగళ్లు సిద్ధం చేసుకున్న రైతులు విత్తన పప్పుశనగ కోసం ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల నల్లరేగడి భూములు కలిగిన చాలా ప్రాంతాల్లో పంట వేయకుండా ఖాళీగానే ఉంచుకున్నారు. వర్షాలు కూడా కురుస్తుండటంతో ముందస్తు సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో రబీ ప్రధాన పంటగా 25 మండలాల్లో 70 వేల నుంచి 80 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. విత్తన పంపిణీ 22 మండలాల పరిధిలో చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అనంతపురం, ఆత్మకూరు, కూడేరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, బెళుగుప్ప, బొమ్మనహాళ్, కణేకల్లు, డి.హీరేహాళ్, గుత్తి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, పామిడి, శింగనమల, యాడికి, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విపడనకల్లు, గుంతకల్లు మండల పరిధిలో జేసీ–11 రకం విత్తనం పంపిణీ చేయనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.