
నిషేధిత భూములపై ప్రత్యేక డ్రైవ్
అనంతపురం అర్బన్: నిషేధిత భూముల (22ఎ) ఫైళ్ల పరిష్కారానికి కలెక్టర్ ఆనంద్ చర్యలు చేపట్టారు. ‘సాక్షి’లో ఈనెల 17న ప్రచురితమైన ‘‘సారూ... దృష్టిపెట్టండి’’ కథనానికి ఆయన స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 32 మండలాలకు చెందిన ఫైళ్ల పరిశీలన ప్రక్రియ కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో మండల తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు చేపట్టారు. ఈ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ మలోల పర్యవేక్షించారు. 32 మండలాల పరిధిలో 2024 జూన్ 15 తరువాత అందిన ఫైళ్లలో ప్రస్తుతం మొదటిదశగా 487 ఫైళ్ల పరిశీలన నిర్వహిస్తున్నారు.
కాలేజీలకు రేపటి నుంచి దసరా సెలవులు
అనంతపురం ఎడ్యుకేషన్: అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలలకు ఆదివారం నుంచి అక్టోబరు 5 వరకు దసరా పండుగ సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నేపఽథ్యంలో జిల్లాలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ శుక్రవారం తెలిపారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్నట్లుగా తమ దృష్టికి వస్తే నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యా వ్యవస్థలో క్రమశిక్షణను, విద్యార్థుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లాకు 1,586 మెట్రిక్ టన్నుల యూరియా
అనంతపురం అగ్రికల్చర్: నర్మదా కంపెనీ నుంచి 1,585.85 మెట్రిక్ టన్నుల యూరియా శుక్రవారం జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్‌పాయింట్‌లో వ్యాగన్ల ద్వారా సరఫరా అయిన యూరియా లాట్లను ఆయన పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చిన దాంట్లో 1,020 మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్‌కు, 565.85 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్లకు కేటాయించినట్లు తెలిపారు. ఇండెంట్ల మేరకు మార్క్‌ఫెడ్ నుంచి ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలు, ఎఫ్‌పీవోలకు, ప్రైవేట్ డీలర్ల నుంచి రీటైల్ దుకాణాలకు సరఫరా చేసి రైతులకు అందుబాటులో పెడతారని తెలిపారు.

నిషేధిత భూములపై ప్రత్యేక డ్రైవ్

నిషేధిత భూములపై ప్రత్యేక డ్రైవ్