
ఐదేళ్ల నిరీక్షణ.. ఐదు రోజులకే విషాదం!
అనంతపురం మెడికల్: ఆ దంపతులు సంతానం కోసం ఐదేళ్లు నిరీక్షించారు. ఎట్టకేలకు తొలిచూరి కాన్పులో మగబిడ్డ జన్మించాడు. అయితే ఆ బిడ్డ ఐదు రోజులకే కన్ను మూశాడు. ఈ ఘటన ఆ దంపతులను కలచివేసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ మృతి చెందాడంటూ బంధువులు ఆగ్రహించి ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన మేరకు... నగరంలోని హనుమాన్ కాలనీకి చెందిన శిరీష, జయసింహ దంపతులు. ఐదేళ్ల నిరీక్షణ అనంతరం శిరీష తొలిచూరి గర్భం దాల్చింది. నగరంలోని అమ్మ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ డాక్టర్ శివజ్యోతి వద్ద చూపించుకుంటూ వచ్చింది. ఈ నెల 20న అదే ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ సూచన మేరకు కుటుంబ సభ్యులు సాయినగర్‌లోని హృదయ చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. 23వ తేదీ వరకు అంటే మూడు రోజులకే రూ.3.50 లక్షలకు పైగా ఖర్చయ్యింది. అయితే బిడ్డలో అవయవాలు ఒక్కొక్కటిగా ఫెయిల్యూర్ అవుతున్నాయని, మరొక ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఈ నెల 24వ తేదీన బిడ్డను ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్పించారు. అయినా ఫలితం లేకపోయింది. 25వ తేదీ ఆ బిడ్డ చనిపోయాడు. బిల్లు చెల్లించిన తర్వాతనే బిడ్డను బయటకు తీసుకుపోండని హృదయ ఆస్పత్రి నిర్వాహకులు కర్కశంగా వ్యవహరించి జాప్యం చేయడం వల్లే తమ బిడ్డ మరణించాడంటూ శిరీష, జయసింహ దంపతులు ఆరోపించారు. గైనకాలజిస్ట్ శివజ్యోతి కూడా సకాలంలో ప్రసవం చేయకపోవడం వల్లే బిడ్డ ఆరోగ్యం తల్లకిందులైందని ఆరోపిస్తూ బాధితులు బంధువులతో కలిసి శుక్రవారం అమ్మ ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేశారు. ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ మనోరంజన్‌రెడ్డి, గైనకాలజిస్టు డాక్టర్ శివజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తప్పిదం లేదని వారు చెప్పడంతో ఆగ్రహించిన బాధితులు ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఘటనపై ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ మనోరంజన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. చివరకు త్రీటౌన్ సీఐ శాంతిలాల్ సమక్షంలో ఇరు వర్గాల వారు మాట్లాడుకున్నారు.
మృతి చెందిన పసికందు, విలపిస్తున్న శిరీష, జయసింహ
డాక్టర్ల నిర్లక్ష్యంతోబాబు మృతి
‘అమ్మ’ ఆస్పత్రిలో ఫర్నీచర్ ధ్వంసం చేసిన బాధితులు

ఐదేళ్ల నిరీక్షణ.. ఐదు రోజులకే విషాదం!