
అచ్చోసిన ఆంబోతులా బాలకృష్ణ తీరు
● చిరంజీవిపై వ్యాఖ్యలు దుర్మార్గం
● పవన్ స్పందించకపోవడం దారుణం
● మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ: పవిత్రమైన అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తూలుతూ మాట్లాడిన తీరు అచ్చోసిన ఆంబోతులా ఉందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ హుందాగా మాట్లాడాల్సిన బాలకృష్ణ తూలుతూ నోటికొచ్చినట్టు మాట్లాడటాన్ని తప్పుపట్టారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై సినీ పెద్దలైన చిరంజీవి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో జరిపిన చర్చల గురించి కామినేని శ్రీనివాస్ ప్రస్తావించగా.. బాలయ్య కల్పించుకుని అవాకులు చెవాకులు పేలారన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే తోటి సభ్యులంతా ఒక పిచ్చోడిని చూసినట్టే చూస్తుంటారని, ఎందుకంటే బాలయ్య మాట తీరు అలా ఉంటుందని అన్నారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చలు జరిపిన చిరంజీవిని ఉద్దేశించి వాడు, వీడు అంటూ కరడుగట్టిన కులతత్వం, అధికార మదంతో బాలయ్య చేసిన వ్యాఖ్యలు హేయమైనవని అన్నారు. తన అన్నపై ఇంత దారుణంగా బాలకృష్ణ మాట్లాడుతున్నా సభలోనే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించకపోవడం, కనీసం జన సైనికులు దీనిపై మాట్లాడకపోవడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారిన పవన్.. తన అన్నను అవమానపరిచినా తుడుచుకుని వెళ్లిపోయేలా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. చివరకు చిరంజీవి స్పందించి ఆనాడు చర్చల్లో పాల్గొనేందుకు బాలయ్య కోసం ఎన్నిసార్లు ప్రయత్నించారో, తర్వాత చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగిన తీరును లేఖద్వారా తెలియజేశారన్నారు. బాలకృష్ణకు మానసిక స్థితి సరిగా లేదని, ఆయన్ని యర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తే బాగుంటుందని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బెస్తరమణ పాల్గొన్నారు.