
పరిశ్రమలతోనే జిల్లా ప్రగతి
● కలెక్టర్ ఆనంద్
అనంతపురం అర్బన్: పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా ప్రగతి, సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామికరంగాన్ని పటిష్ట పరిచేలా, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని అనుమతులు సకాలంలో మంజూరు చేసి పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తిమ్మసముద్రం, ఊరిచింతల, కూడేరు ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక వాడలను త్వరితగతిన అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌ను ఆదేశించారు. పీఎంఈజీపీ ద్వారా అర్హులైన వారి నుంచి మంచి ప్రాజెక్టులను ఎంపిక చేయాలని పరిశ్రమల శాఖ అధికారిని సూచించారు. ఇటీవల ప్రారంభమైన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో స్టార్టప్‌లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. రాయదుర్గానికి చెందిన పారిశ్రామికవేత్తకు స్థలసేకరణ చేయాలని ఆదేశించారు. స్టాండప్ ఇండియా పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. సమావేశంలో ఇండస్ట్రియల్ పాలసీ కింద 17 యూనిట్లకు పెట్టుబడి, విద్యుత్, వడ్డీ, స్టాంప్‌డ్యూటీ రాయితీలకు రూ.93 లక్షల సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్‌యాదవ్, అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, డీటీసీ వీర్రాజు, ఎల్‌డీఎం నరేష్‌రెడ్డి, ఏపీఐఐజీ డిప్యూటీ జోనల్ మేనేజర్ దేవకాంతమ్మ పాల్గొన్నారు.