
దబిడిదిబిడే అంటే కుదరదు
● బాలయ్య వ్యాఖ్యలపై భగ్గుమన్న విద్యార్థి, యువజన విభాగం
అనంతపురం కార్పొరేషన్: బాధ్యతగల ఎమ్మెల్యే పదవిలో ఉంటూ సినిమాల్లోలా దబిడిదిబిడే అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేస్తే కుదరదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను వైఎస్సార్ విద్యార్థి, యువజన విభాగాలు హెచ్చరించాయి. అత్యంత ప్రజాదరణ కలిగిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా బాలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. బాలకృష్ణ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, యువజన విభాగం నగరాధ్యక్షుడు శ్రీనివాస దత్తా మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ పాలనలో విద్య, వైద్యంతో పాటు వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన అప్పటి సీఎం జగన్ విశేష ప్రజాదరణను సొంతం చేసుకున్నారన్నారు. బాలకృష్ణ తన హుందాను మరచి నోరు పారేసుకుంటూ పోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదు, నగర ఉపాధ్యక్షుడు ఉదయ్, విద్యార్థి విభాగం నగరాధ్యక్షుడు కైలాష్, నాయకులు మసూద్ అలి, మహ్మద్ రఫి, సురేష్, అకాష్, సాదిక్, వినీత్ పాల్గొన్నారు.
బాలకృష్ణ దిష్టిబొమ్మ దహనం
వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మదిరెడ్డి నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని టవర్‌క్లాక్ వద్ద బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. నరేంద్రరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి లింగారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తన తప్పు తెలుసుకుని ఆయన మాటలు వెనక్కు తీసుకోవాలన్నారు. గతంలో ఇంటిలో కాల్పులు జరిగిన ఘటనలో బాలకృష్ణను రక్షించిందెవరో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నితిన్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌రెడ్డి, నాయకులు సుధీర్, మాధవరెడ్డి, లోకేష్‌శెట్టి, హేమంత్ యాదవ్, వడ్డే ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలుపుతున్న నాయకులు
బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న యువజన, విద్యార్థి విభాగాల నాయకులు

దబిడిదిబిడే అంటే కుదరదు