
స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి హెచ్చరించారు. స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఎస్టీయూ జిల్లా రెండో కార్యవర్గ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన రఘనాథరెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి, సీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు అంటూ ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్సనర్లకు కూటమి పెద్దలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన తర్వాత ఓ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. 27 నెలలుగా ఆలస్యం చేస్తూ వచ్చిన 12వ పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2024, జనవరి నుంచి ఇప్పటి వరకూ బకాయి పడిన నాలుగు డీఏలు మంజూరు చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుపై ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించక పోతే అక్టోబర్ 7న విజయవాడలో వేలాది మందితో ధర్నా చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజనేయులు, ఆర్థిక కార్యదర్శి గంటే ప్రసాద్, విశిష్ట అతిథులు సీపీఐ జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి, సహాయ కార్యదర్శి రాజారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉద్యోగులను విస్మరించిన కూటమి ప్రభుత్వం
ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి