
ప్రమాదమే సతీష్‌రెడ్డిని బలిగొంది
● ప్రాథమిక విచారణలో స్పష్టమైనట్లు వెల్లడించిన డీఎస్పీ రవిబాబు
అనంతపురం: పామిడి మండలం జి.కొట్టాల గ్రామానికి చెందిన దేవన సతీష్‌రెడ్డి మృతి కేవలం ప్రమాదం వల్లనే జరిగిందని గుంతకల్లు డీఎస్పీ రవిబాబు స్పష్టం చేశారు. అనంతపురం అర్భన్ డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 24న రాత్రి 8:40 గంటల సమయంలో పామిడి– నాగసముద్రం రోడ్డులోని సిమెంటు పెళ్లల ఫ్యాక్టరీ వద్ద సతీష్‌రెడ్డి రక్తగాయాలతో మృతి చెందినట్లుగా సమాచారం అందుకున్న పామిడి ఇన్‌చార్జ్ సీఐ రాజు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారన్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం ట్రాక్టర్ ట్రాలీకి రక్తపు మరకలు అంటిన దృశ్యాన్ని గమనించి డ్రైవర్ దేవరపల్లి సాయికుమార్‌ను విచారణ చేయడంతో ట్రాక్టర్‌లో ఇంటి సామగ్రిని పామిడి నుంచి గుత్తి మండలం బ్రాహ్మణపల్లికి చేరవేస్తుండగా మార్గమధ్యంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి ఢీకొని కిందపడిపోయినట్లుగా అంగీకరించాడన్నారు. అయితే డ్రైవర్ భయపడి ముందుకెళ్లిపోయి, సామాన్లు అన్‌లోడ్ చేసి అదే రోజు రాత్రి 11 గంటలకు తిరిగి అదే దారి గుండా వెళుతూ తన ట్రాక్టర్‌కు గుద్దుకున్న వ్యక్తి చనిపోయి ఉండటాన్ని గమనించి వాహనాన్ని పామిడిలోని ఓనర్ రాజకుళ్లాయప్ప ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడన్నారు. సతీష్‌రెడ్డి మృతికి ప్రమాదమే కారణమనేందుకు పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ కేసులో లీగల్ ఒపీనియన్ తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
16 వరకూ పోషణ్ మాసోత్సవాలు
అనంతపురం సెంట్రల్: కలెక్టర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 16 వరకూ పోషణ్ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ నాగమణి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆరోగ్యవంతమైన మహిళా – శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాది’ అనే అంశంపై జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.