
హోంగార్డుపై టీడీపీ అల్లరి మూక దాడి
గుంతకల్లు: రోజు వారీ విధుల్లో భాగంగా కసాపురం దేవస్థానం వద్ద డ్యూటీలో ఉన్న హోంగార్డు పుల్లయ్యపై టీడీపీ అల్లరి మూకలు విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డాయి. వివరాలు.. గుంతకల్లు వన్‌టౌన్ పీఎస్‌లో పనిచేస్తున్న హోం గార్డు పుల్లయ్య గత 24 రోజులుగా కసాపురం ఆలయం వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో రాజగోపురం వద్ద విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మద్యం ఫుల్‌గా సేవించి స్కూటీపై వచ్చిన కసాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు భీమప్ప, మంజు, రాము.. పుల్లయ్యతో ఘర్షణపడ్డారు. ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటావా? అంటూ భీమప్ప, మంజు కొడుతుండగా స్థానిక దుకాణదారులు అడ్డుకోవడం జారుకున్నారు. అనంతరం పుల్లయ్యను రాము తన స్కూటీలో ఎక్కించుకుని సమీపంలోని సులభ కాంప్లెక్స్ వద్ద తీసుకెళ్లి అక్కడ కాపు కాచిన భీమప్ప, మంజుతో కలసి మరోసారి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారి బారి నుంచి తప్పించుకుని ఆలయ ఉద్యోగుల సాయంతో గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నాడు. చికిత్స అనంతరం కసాపురం పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.