
మొక్కజొన్న విత్తనాల మోసం
బొమ్మనహాళ్: తమ కంపెనీ మొక్కజొన్న విత్తనాలు సాగు చేస్తే అధిక దిగుబడి ఖాయమంటూ రైతులకు నకిలీ విత్తనాలను బలవంతంగా అంటగట్టిన ఘటన బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో వెలుగు చూసింది. బాధిత రైతులు తెలిపిన మేరకు... కణేకల్లు క్రాస్‌కు చెందిన ఓ ఫర్టిలైజర్ దుకాణం నిర్వాహకుడు హరినాథ్... హైదరాబాద్‌కు చెందిన బయర్ విత్తన కంపెనీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో 2024లో దర్గాహొన్నూరు గ్రామానికి చెందిన 50 మంది రైతులకు నమ్మబలికి మొక్కజొన్న విత్తనాలను బలవంతంగా అంటగట్టి వంద ఎకరాల్లో సాగు చేయించాడు. ఆశించిన మేర పంట దిగుబడులు రాకపోవడంతో ఏజెంట్‌ను రైతులు నిలదీశారు. దీంతో గత ఏడాది కంపెనీ ప్రతినిధులు వచ్చి పంట పరిశీలన చేసి ఎకరాకు రూ.45 వేలు చొప్పున పరిహారం చెల్లించేలా ఒప్పంద పత్రం రాసిచ్చారు. అనంతరం ఏజెంట్ అరకొర పరిహారం చెల్లించి తర్వాత ముఖం చాటేశాడు. తమను మోసం చేసిన ఏజెంట్‌పై చర్యలు తీసుకుని పరిహారం ఇప్పించాలని బాధిత రైతులు మోహనందప్ప, శివగంగమ్మ, సంతోష్ వేడుకుంటున్నారు.