
డబుల్ మర్డర్ కేసులో నిందితుడిపై దాడి
తాడిపత్రి టౌన్: రెండేళ్ల క్రితం తాడిపత్రిలో చోటు చేసుకున్న డబుల్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న కాకర్ల సుల్తాన్ హుస్సేన్‌పై హతుల బంధువులు దాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. 2022లో జరిగిన డబుల్ మర్డర్ కేసులో ఆరుగురు నిందితులు కాగా, 2024 జనవరిలో స్థానిక బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఆరీఫ్ అనే నిందితుడిని హతుల బంధువులు దాడి చేసి హతమార్చారు. దీంతో కాకర్ల సుల్తాన్ హుస్సేన్ ప్రాణభయంతో బెంగళూరుకు మకాం మార్చాడు. ఈ క్రమంలో తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుసుకున్న ఆయన రెండు రోజుల క్రితం తాడిపత్రికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న డబుల్ మర్దర్ కేసులో బాధిత బంధువులు, బుక్కపట్లం వీధికి చెందిన రహంతుల్లా, షాషు, షాంబుల్లా మంగళవారం రాత్రి సుల్తాన్ హుస్సేన్‌పై ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకుని హుస్సేన్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మట్కా బీటర్ల అరెస్ట్
గుత్తి: స్థానిక అమృత్ సినిమా థియేటర్ వెనుక ఉన్న ఎస్సీ కాలనీలో మట్కా రాస్తూ ముగ్గురు బీటర్లు పట్టుబడినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు. అందిన సమాచారం మేరకు బుధవారం తనిఖీలు చేపట్టిన సమయంలో మట్కా రాస్తూ రామాంజనేయులు, రాము, యల్లమ్మ పట్టుబడ్డారన్నారు. బీటర్లను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.25,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.