
నగరానికి ‘షాడో’ పీడ
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో నగరంలో అభివృద్ధి అటకెక్కింది. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి షాడోకి పర్సెంటేజీలు సమర్పిస్తేనే పనులు ప్రారంభించే దుస్థితి నెల కొంది. దీంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలే దంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న ‘తమ్ముళ్లు’.. నేడు రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వారే అడ్డుపడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలోనూ పదుల సంఖ్యలో అభివృద్ధి పనుల టెండర్లను ‘షాడో’ రద్దు చేయించా రని నగరపాలక సంస్థ వర్గాలంటున్నాయి.
ప్రజలకు అవస్థలు..
అనంతపురంలోని జీసస్‌నగర్‌లో వర్షం వస్తే రెండు, మూడ్రోజుల పాటు కాలనీ వాసులు ప్రత్యక్ష నరకం చూడాల్సి వస్తోంది. కాలనీలో రూ.38 లక్షలతో సీసీ రోడ్డు వేయాలని నిర్ణయించినా ఇంత వరకు పనులు మొదలు కాలేదు. విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి హౌసింగ్ బోర్డుకు వెళ్లే మార్గంలో రూ.66 లక్షలతో సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని టెండర్లు పిలిచినా పనులు మాత్రం ప్రారంభించలేదు. 38వ డివిజన్ వడ్డే కాలనీలో రూ.28 లక్షలతో రోడ్లు వేయాలని టెండర్లను పిలిచినా పనులను కాంట్రాక్టర్ చేపట్టడం లేదు. అలాగే హమాలీ కాలనీ, వేణుగోపాల్‌నగర్, గుల్జార్‌పేట, అశోక్‌నగర్, అంబేడ్కర్‌నగర్, 2,3 రోడ్లు, గౌరవగార్డెన్ ప్రాంతాల్లో సైతం అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీనంతటికీ ‘షాడో’నే కారణమని తెలిసింది.
121 పనులు.. రూ.16.19 కోట్లు
కూటమి ప్రభుత్వంలో నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం రూ.16.19 కోట్లతో 121 పనులకు టెండర్లు ఆహ్వానించారు. అందులో టెండర్ స్టేజ్‌లో రూ.8.7 కోట్లకు సంబంధించి 50 అభివృద్ధి పనులు ఉన్నాయి. అగ్రిమెంట్ స్టేజ్‌లో రూ.5 కోట్లకు సంబంధించి 52 పనులున్నాయి. ప్రజాప్రతినిధి షాడోను కాంట్రాక్టర్లు ప్రసన్నం చేసుకుంటేనే పనులకు గ్రీన్ సిగ్నల్ లభించే దుస్థితి నెలకొంది. టెండర్ వేయా లన్నా.. దక్కించుకుని పనులు ప్రారంభించాలన్నా ‘షాడో’ను కలవాల్సి వస్తోందని సమాచారం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితి ఎక్కడా లేకపోవడం గమనార్హం.
జిల్లా కేంద్రంలో ఆగిన అభివృద్ధి
ప్రజాప్రతినిధి షాడోకు పర్సెంటేజీలు సమర్పిస్తేనే కాంట్రాక్టులు
చేపట్టిన పనులను సైతం ముడుపులు ముట్టలేదని నిలిపేస్తున్న వైనం

నగరానికి ‘షాడో’ పీడ