
ఉద్యోగానికి పిలిచి.. లేదన్నారు!
చివరి నిమిషంలో పేరు మార్చారు
● అర్హత సాధించి..సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థికి నో చాన్స్
హిందూపురం టౌన్: డీఎస్సీలో అర్హత సాధించినా.. నియామక పత్రం అందే వరకూ ఉద్యోగంపై ఆశ పెట్టుకోవద్దని మరోసారి రుజువైంది. ఇంతకీ ఏం జరిగిందంటే...బుక్కపట్నం మండలానికి చెందిన వరలక్ష్మి ప్రస్తుతం హిందూపురంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో ఆమె ఆంగ్ల సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్‌లో 101వ ర్యాంకు సాధించారు. ఎంపిక జాబితాలో 85 నంబర్‌లో ఉన్నారు. ఆమెను ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపిక చేసినట్లు విద్యాశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆమె సర్టిఫికెట్లు కూడా పరిశీలించారు. అమరావతిలో నియామక ఉత్తర్వులు తీసుకునేందుకు ఈనెల 18వ తేదీన బయలుదేరారు. అయితే కార్యక్రమం వాయిదా పడటంతో తిరిగి ఇంటికి వచ్చారు. నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు అమరావతిలో గురువారం అధికారులు కార్యక్రమం ఏర్పాటు చేయగా...బుధవారం జిల్లాకు చెందిన అభ్యర్థులంతా బయలుదేరి వెళ్లారు. అయితే ఈసారి వరలక్ష్మికి మంగళవారం రాత్రి అనంతపురం డీఈఓ వరప్రసాద్ ఫోన్ చేసి.. జాబితాలో పేరు లేదని చెప్పడంతో ఆమె కంగుతిన్నారు. అర్హత సాధించినప్పటికీ తనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదంటూ బోరున విలపించారు. అయినప్పటికీ ఆ అంశం తమ పరిధిలో లేదని అధికారులు చేతులెత్తేశారు.
నేను 2025 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్‌కి సెలెక్ట్ అయ్యాను. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయ్యింది. నియామక పత్రం అందుకునేందుకు సిద్ధం కాగా... మంగళవారం రాత్రి 8:30 సమయంలో డీఈఓ ఫోన్ చేసి సెలెక్షన్ లిస్ట్‌లో మీ పేరు లేదని చెప్పారు. ర్యాంకులో మీకంటే ముందున్న ఆంజనేయులు అనే అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. నేను టీజీటీలో 250 ర్యాంకు సాధించాను. ఆ ర్యాంకు ప్రకారం జోన్ –4లో తీసుకున్నప్పటికీ టాప్ లిస్టులో రెండో స్థానంలో 250 ర్యాంకుతో టీజీటీ పోస్ట్‌కు అర్హత ఉంది. అందులో ఉద్యోగం ఇవ్వాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదు. నాకంటే తక్కువ ర్యాంకు సాధించిన వారికీ ఉద్యోగం ఇచ్చారు. కానీ టీజీటీలో నాకు 250 ర్యాంకు వచ్చినా అనర్హురాలిగా ప్రకటించారు. కనీసం టీజీటీలోనైనా ఉద్యోగం ఇవ్వాలి.
– వరలక్ష్మి