ఈ– పాస్‌ యంత్రాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ఈ–పాస్‌ యంత్రాల పంపిణీ

Sep 25 2025 7:23 AM | Updated on Sep 25 2025 12:50 PM

అనంతపురం అర్బన్‌: రేషన్‌ డీలర్లకు అధునాతన ఈ–పాస్‌ యంత్రాలు అందిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ తెలిపారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురంలోని కృష్ణ కళామందిర్‌లోని రెవెన్యూ భవన్‌ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జేసీ ముఖ్యఅతిథిగా హాజరై... ఆత్మకూరు, గార్లదిన్నె, కూడేరు మండలాలకు చెందిన డీలర్లకు ఈ–పాస్‌ యంత్రాలను పంపిణీ చేసి, మాట్లాడారు. ఆండ్రాయిడ్‌ మైక్రో కంట్రోలర్‌ ఆధారిత, ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ గుర్తింపు, టచ్‌ స్క్రీన్‌ ఇంటర్‌ ఫేస్‌ డేటా ప్రాసెసింగ్‌ ఆధారంగా పనిచేసే నూతన ఈ–పాస్‌ యంత్రాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియలో పారదర్శకత, ప్రతి లావాదేవీ రియల్‌ టైంలో నమోదవుతాయన్నారు. జిల్లాలోని 1,645 చౌక దుకాణ డీలర్లకు ఈ నెల 27వ తేదీలోపు ఈ–పాస్‌ యంత్రాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, మండలాల సీఎస్‌డీటీలు పాల్గొన్నారు.

వీఆర్వో సరెండర్‌

కళ్యాణదుర్గం: వీఆర్‌ఓ పి.ఉమేష్‌ బాబును కలెక్టర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేసిట్లు కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజినల్‌ అధికారి వసంతబాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కళ్యాణదుర్గంలో విధులు నిర్వర్తిస్తున్న ఉమేష్‌ బాబు ఇటీవల అవినీతి అక్రమాలకు పాల్పడుతునట్లు ప్రాథమికంగా నిర్ధారణ జరిగిందని ఆర్డీఓ తెలిపారు. దీంతో సరెండర్‌ చేసినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు.

రైల్వే కార్మికులకు 78 రోజుల బోనస్‌

గుంతకల్లు: రైల్వే కార్మికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దసరా పండగ సందర్భంగా 78 రోజుల వేతనానికి సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్‌ బోనస్‌ కార్మికులకు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సమాచారం అందినట్లు డివిజన్‌ అధికారులు తెలిపారు. దీంతో గుంతకల్లు డివిజన్‌ వ్యాప్తంగా ఉన్న దాదాపు 14,500 మంది కార్మికులకు సుమారు రూ.24 కోట్లు మంజూరు కానున్నాయి. ఒక్కో కార్మికుని బోనస్‌ రూపంలో రూ.17,951 మేర ఖాతాల్లో జమ కానుంది.

జిల్లాకు 862 మెట్రిక్‌ టన్నుల యూరియా

అనంతపురం అగ్రికల్చర్‌: కోరమాండల్‌ కంపెనీ నుంచి బుధవారం 862.23 మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు సరఫరా అయినట్లు రేక్‌ ఆఫీసర్‌, ఏడీఏ అల్తాఫ్‌ అలీఖాన్‌ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్‌ రేక్‌ పాయింట్‌కు వ్యాగన్ల ద్వారా చేరిన యూరియా బస్తాలను ఆయన పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు 336 మెట్రిక్‌ టన్నులను మార్క్‌ఫెడ్‌కు, 526.23 మెట్రిక్‌ టన్నులను ప్రైవేట్‌ డీలర్లకు, మన గ్రోమోర్‌ సెంటర్లకు కేటాయించినట్లు తెలిపారు. ఇండెంట్‌ మేరకు మార్క్‌ఫెడ్‌ నుంచి ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలకు, అలాగే ప్రైవేట్‌ డీలర్ల నుంచి రిటైల్‌ దుకాణాలు, కోరమాండల్‌కు చెందిన మనగ్రోమోర్‌ సెంటర్లకు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ–పాస్‌ యంత్రాల పంపిణీ 1
1/1

ఈ–పాస్‌ యంత్రాల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement