
ప్రాజెక్టులకు భూ సేకరణపై నిర్లక్ష్యమొద్దు
● కలెక్టర్ ఆనంద్
అనంతపురం అర్బన్: ‘‘భూసేకరణ, బదలాయింపు ప్రక్రియ పూర్తవ్వకపోతే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి. భూ సేకరణలో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుని ముందుకెళ్లాలి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించాలి. ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదు’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులకు భూసేకరణ, భూ బదలాయింపు అంశాలపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారులు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్, ఏపీ ట్రాన్స్‌కో, రైల్వే, ఏపీఐఐసీ, ఏపీజెన్‌కో తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ వివరాలపై ఆరా తీశారు. ఏ ప్రాజెక్టుకు సేకరించాల్సిన భూమి ఎంత, ఇప్పటి వరకు ఎంత భూమి సేకరించి అప్పగించారు, భూసేకరణకు ఏఏ చోట్ల, ఏ తరహా అడ్డంకులు ఉన్నాయి, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంలో భూ సేకరణ చాలా కీలకమన్నారు. ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే ఆ ప్రభావం అభివృద్ధిపై చూపిస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భూసేకరణ ప్రక్రియలో ఎదురైన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. తాడిపత్రి పరిధిలోని తలారి చెరువు, ఆలూరు పరిధిలో సోలార్ పార్క్‌కు సంబంధించి డీకేటీ నివేదికను రెవెన్యూ, జెన్‌కో అధికారులు సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డీఓలు కేశవనాయుడు, వసంతబాబు పాల్గొన్నారు.