
చీనీ, టమాట మార్కెట్ల పరిశీలన
అనంతపురం అగ్రికల్చర్: మార్కెటింగ్ పరిస్థితులు తెలుసుకునేందుకు ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, అగ్రివాచ్ సంస్థ ప్రతినిధి హిమయుద్దీన్ తదితరులు మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ మార్కెట్, కక్కలపల్లి టమాటా మండీలను పరిశీలించారు. జిల్లాలో సాగులో ఉన్న పంటల విస్తీర్ణం, దిగుబడులు, మార్కెట్ ధరలు, రైతుల కష్టనష్టాలు, ట్రేడర్ల పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడాలని ట్రేడర్లకు సూచించారు. ప్రస్తుతం చీనీ, టమాట ధరలు కాస్త నిలకడగానే కొనసాగుతున్నట్లు తెలిపారు. ధరల్లేక రోడ్డున పడేసే పరిస్థితి తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అలాంటి పరిస్థితి ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని ట్రేడర్లు, మండీ నిర్వాహకులకు సూచించారు. పరిశీలనలో ఉద్యానశాఖ ఏడీ దేవానంద్‌కుమార్, ఏపీఎంఐపీ ఏపీడీ ధనుంజయ, హెచ్‌వో రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.