
ఉమ్మడి జిల్లాకు వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత వాతావరణశాఖ, విశాఖ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 24వ తేదీన 6.8 మి.మీ, 25న 3 మి.మీ, 26న 2.8 మి.మీ, 27న 15 మి.మీ, 28న 3.2 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 32.8– 30 డిగ్రీల మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.4– 22 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గంటకు 10 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా గాలి వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
‘అలాంటి దరఖాస్తులు
స్వీకరించం’
తాడిపత్రి రూరల్: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం అనేది లేదని, అందుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించబోమని తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కార్యాలయంలో సిబ్బంది నోటీసు అతికించారు. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి వందలాది మంది వితంతువులు దరఖాస్తు చేసుకోవడానికి తరలిరావడంతో తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది బిత్తరపోయారు. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. తహసీల్దార్ సోమశేఖర్ మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోరాదని సూచించారు. గ్రామ సచివాలయాల్లోని సిబ్బందిని సంప్రదించి వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు.
బధిరుల సంక్షేమానికి
సంపూర్ణ సహకారం
● కలెక్టర్ ఆనంద్
అనంతపురం అర్బన్: బధిరుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ప్రపంచ బధిరుల, సైన్ లాంగ్వేజ్ దినోత్సవానికి కలెక్టర్‌తో పాటు విభిన్న ప్రతిభావంతుల సంస్థ రాష్ట్ర చైర్మన్ నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ కేక్ కట్ చేసి బధిరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 45 మంది బధిరులకు ఉద్యోగం కల్పించామని, 6,707 మందికి పింఛను అందిస్తున్నామన్నారు. శ్రవణ యంత్రాలను అర్హులైన 948 మందికి త్వరలో పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ అర్చన, సర్వశిక్ష అభియాన్ పీడీ శైలజ, ఆర్‌డీటీ ప్రతినిధి రఫీ, బధిరుల సంక్షేమ సంఘం ప్రతినిధులు లక్ష్మి నరసింహ, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఐవీ బాధితులకు చికిత్సలందించాలి
హెచ్‌ఐవీ బాధితులకు తప్పనిసరిగా చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏఆర్‌టీ కేంద్రాల్లో నమోదయ్యేలా చూడడంతో పాటు చికిత్స అందించాలన్నారు. చికిత్స తీసుకోవడం ద్వారా హెచ్‌ఐవీని నియంత్రించవచ్చని, తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటారనే విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాజిటివ్ నెట్‌వర్క్ ప్రతినిధులు కలిసి నచ్చజెప్పాలన్నారు. డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, డీపీఓ నాగరాజునాయుడు తదితరులున్నారు.

ఉమ్మడి జిల్లాకు వర్షసూచన

ఉమ్మడి జిల్లాకు వర్షసూచన