
నిండుకుంటున్న యూరియా నిల్వలు
● బఫర్‌స్టాక్ ద్వారా
పరిమితంగా సరఫరా
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో యూరియా నిల్వలు నిండుకుంటున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కూటమి సర్కారులో పంటలకు అవసరమైన మేరకు ఎరువు వేయలేని పరిస్థితి నెలకొంది. 2019–24 మధ్య వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ ఎక్కడా యూరియా సమస్య ఎదురుకాలేదని రైతులు చెబుతున్నారు.ఇప్పుడెందుకు సమస్య వచ్చిందో అర్థంకాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దండిగా సరఫరా చేశామని కూటమి ప్రభుత్వం, వ్యవసాయశాఖ చెబుతున్నా.. తగినంత తమకు అందడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 436 ఆర్‌ఎస్‌కేలు, మూడు డీసీఎంఎస్‌లు, 13 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీలు), రెండు రైతు గ్రూపు సంఘాలు (ఎఫ్‌పీఓ), మూడు హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లు, 460 వరకు రీటైల్ దుకాణాల ద్వారా ఇప్పటికే 35 వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నా... ఒకట్రెండు బస్తాల కోసం రోజుల తరబడి రైతులు పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందనేది చెప్పడం లేదు. ఈ సీజన్‌లో డీఏపీ, యూరియా, ఎస్‌ఎస్‌పీ, ఎంఓపీ, కాంప్లెక్స్ ఎరువులు 1.07 లక్షల మెట్రిక్ టన్నులు అందించాలని ప్రణాళిక అమలు చేస్తున్నారు. అందులో యూరియా 26,789 మెట్రిక్ టన్నులు టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 23,400 టన్నుల వరకు సరఫరా అయినట్లు చెబుతున్నారు. ఇది కాకుండా గత ఖరీఫ్, రబీలో మిగులు (ఓపెనింగ్ బ్యాలెన్స్) 15,240 మెట్రిక్ టన్నులు చూపించి రైతులకు పంపిణీ చేశామని చెబుతున్నారు. మరి ఇంత మొత్తంలో పంపిణీ చేసినా ఎందుకు యూరియా సమస్య ఈ స్థాయిలో ఎదురవుతోందనే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి.
పక్కదారి పట్టడంతోనే..
మే, జూన్ నెలల్లో జిల్లాకు చేరిన యూరియాలో చాలా వరకు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యూరియా కొరత తీవ్రస్థాయికి చేరుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రైవేట్ డీలర్ల వద్ద బస్తా యూరియా కావాలంటే డీఏపీ, కాంప్లెక్స్, లేదా డ్రిప్ మందులు కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా డిమాండ్ అధికంగా ఉండటంతో ఎంఆర్‌పీకి మించి విక్రయాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక డీసీఎంఎస్‌లకు సరఫరా చేయడం ఆపేశారు. ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలకు పరిమితంగా సరఫరా చేస్తున్నారు. యూరియా నిల్వలు అడుగంటి పోవడంతో మార్క్‌ఫెడ్ దగ్గర ఉన్న 800 మెట్రిక్ టన్నుల బఫర్‌స్టాక్ నుంచి రోజూ కొన్ని ఆర్‌ఎస్‌కేలకు పరిమితంగా సరఫరా చేస్తున్నారు. మండలంలో ఒక ఆర్‌ఎస్‌కేను ఎంపిక చేసుకుని ఏఓలు, ఏఈఓలు, ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు జాగ్రత్తగా పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొంది.