అటకెక్కిన విద్యాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

అటకెక్కిన విద్యాభివృద్ధి

Sep 23 2025 7:30 AM | Updated on Sep 23 2025 7:30 AM

అటకెక్కిన విద్యాభివృద్ధి

అటకెక్కిన విద్యాభివృద్ధి

జాబితాలో పేర్లపై లీకులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లా ‘సమగ్ర శిక్ష’ గందరగోళంగా మారింది. సెక్టోరియల్‌ అధికారులు లేక పాలన కుంటుపడింది. ఈ ప్రభావం విద్యాభివృద్ధిపై పడుతోంది. సమగ్రశిక్షలో పని చేస్తున్న సెక్టోరియల్‌ అధికారులందరినీ నిబంధనలకు విరుద్ధంగా 2024 ఆగస్టు 1న రిలీవ్‌ చేశారు. ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఉన్నవారిని తప్పించారు. అప్పట్లో డీఈఓగా పని చేసిన వరలక్ష్మీ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. ఉన్నవారిని తప్పించేందుకు చూపించిన శ్రద్ధ కొత్తవారిని తీసుకోవడంలో చూపించలేకపోయారు. ఫలితంగా ఏడాదిదాటినా ఆ పోస్టులు భర్తీ కాలేదు.

చివరిస్థానానికి పడిపోయిన జిల్లా

పూర్తిస్థాయిలో సెక్టోరియల్‌ అధికారులు ఉన్న సమయంలో డీపీసీ, ఏపీసీ సమన్వయం, ఎంఈఓలు, హెచ్‌ఎంలతో తరచూ పర్యవేక్షణ కారణంగా పీఎంశ్రీ, టీచ్‌టూల్‌, ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ కార్యక్రమాలు, ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ తదితర అంశాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో ఉండేది. సెక్టోరియల్‌ అధికారులను పంపిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి స్థానం పక్కన పెడితే చివరిస్థానంలో నిలవాల్సిన దుస్థితి ఏర్పడింది. సమగ్రశిక్షలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నా జిల్లాలోని మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కనీస దృష్టి సారించకపోవడం బాధాకరమని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ఇంటర్వ్యూ ముగిసి నెలదాటినా...

2024 ఆగస్టు 1న సెక్టోరియల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సుమారు 8 నెలల తర్వాత 5 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి కలెక్టర్‌ ఆమోదంతో ఎస్పీడీ కార్యాలయానికి పంపారు. అక్కడి నుంచి కమిషనర్‌, ప్రిన్సిపల్‌ కార్యదర్శికి వెళ్లింది. ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆమోదముద్ర వేశారు. అయితే తాము సిఫార్సు చేసిన వారి పేర్లు లేకపోవడంతో కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేసి అమలు చేయకుండా అడ్డుపుల్ల వేశారు. ఎట్టకేలకు ఇద్దరిని మాత్రం (జీసీడీఓ, అసిస్టెంట్‌ ఏఎంఓ) ఈ ఏడాది జూన్‌లో తీసుకున్నారు. తక్కిన పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ క్రమంలో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. సీనియార్టీ జాబితా తయారు చేశారు. మార్కులు మాత్రం బయటకు వెల్లడించకుండా అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు. ఆగస్టు రెండో వారంలో ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా ముగిసింది. ఒకట్రెండు రోజుల్లో పూర్తవుతుందని భావించినా నేటికీ దీనిపై స్పష్టత లేదు.

కమిషనరేట్‌ నుంచి ఎప్పుడొస్తుందో...?

ఇంటర్వ్యూల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేసి ఆమోదం కోసం కమిషనరేట్‌కు పంపామని అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి ఎప్పుడొస్తుందనేది చెప్పడం లేదు. సెక్టోరియల్‌ ఆఫీసర్స్‌ లేక అల్లాడుతుంటే, మరోవైపు మినిస్టీరియల్‌ పోస్టులూ ఖాళీగా ఉండడం ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టు ఖాళీగా ఉంది. సూపరింటెండెంట్‌గా ఇటీవల కొత్తగా బాధ్యతలు తీసుకున్న కృష్ణారావు లాంగ్‌లీవ్‌లో వెళ్లారు. సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కలెక్టర్‌ ఆనంద్‌ అయినా ‘సమగ్ర శిక్ష’పై దృష్టి సారించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

‘సమగ్ర’ గందరగోళం

ఏడాదికిపైగా భర్తీకాని

సెక్టోరియల్‌ అధికారుల పోస్టులు

రెండుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి

ఇద్దరినే తీసుకున్న అధికారులు

ఇంటర్వ్యూలు ముగిసి

నెలన్నరవుతున్నా కొలిక్కిరాని వైనం

పర్యవేక్షణ లేక కుంటు పడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలు

కొత్త కలెక్టర్‌ అయినా దృష్టి పెట్టేనా?

కమిషనరేట్‌కు పంపిన జాబితాపై కొందరు లీకులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో దరఖాస్తు చేసుకున్న కొందరు తమకు అవకాశం ఇచ్చారంటూ బయట ప్రచారం చేసుకుంటున్నారు. గార్లదిన్నె మండలంలో పని చేస్తున్న ఓ ఎస్జీటీ ఇటీవల బుక్కరాయసముద్రం సమీపంలో తన సహచరులకు డిన్నర్‌ కూడా ఇచ్చారు. మరో టీచరు ప్రాథమిక విద్యలో ఒక తరగతి కన్నడ మీడియంలో చదివి, దీన్ని అడ్డుగా పెట్టుకుని అసిస్టెంట్‌ ఏఎంఓ కన్నడ పోస్టుకు ఆమోదముద్ర వేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement