
ఆర్డీటీ పరిరక్షణ కమిటీకి సంపూర్ణ మద్దతు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ పరిరక్షణ కమిటీకి వైఎస్సార్ సీపీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంటకరామిరెడ్డి, పార్టీ ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల సమన్వయ కర్తలు విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య పేర్కొన్నారు. ఉద్యమ కార్యాచరణకు పూర్తి సహకారమందిస్తామన్నారు. సోమవారం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 56 ఏళ్లుగా ఆర్డీటీ పేదలకు అండగా ఉంటోందన్నారు. విద్య, వైద్యంతో పాటు మహిళా సాధికారత సాకారంలో ప్రభుత్వానికి దీటుగా పని చేస్తోందన్నారు. అలాంటి సంస్థకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంకారణంగా ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌లో జాప్యం జరుగుతుండడంతో సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇప్పటికే ఆర్డీటీకి మద్దతుగా వైఎస్సార్ సీపీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఆర్డీటీ మూతపడితే వేలాది మంది ఉపాధి కోల్పోతారన్నారు. విద్య, వైద్యం ఇబ్బందిగా మారే పరిస్థితి లేకపోలేదన్నారు. ఉమ్మడి జిల్లాలోని బత్తలపల్లి, కళ్యాణదుర్గం, కణేకల్లు ప్రాంతాల్లో 600 పడకలతో ఆర్డీటీ ఆస్పత్రులను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తోందన్నారు. ఆర్డీటీని కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యంగా భావించి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటు ప్రత్యక్షంగానూ పాల్గొంటామన్నారు. దసరా నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణలో మార్పులు చేసుకోవాలన్నారు. ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, పండుగ తర్వాత జాతీయ రహదారుల దిగ్భంధం లాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని ఆర్డీటీ పరిరక్షణ కమిటీకి వారు సూచించారు.
సెలవుల్లో తరగతులు నిర్వహించొద్దు
● ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు డీఈఓ ఆదేశం
అనంతపురం ఎడ్యుకేషన్: దసరా పండుగ సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలకు అక్టోబరు 2 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందన్నారు. ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా విద్యార్థులకు తరగతులు పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సెలవులను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కోరారు.
కారుణ్యం చూపారు..
అనంతపురం అర్బన్: కారుణ్య నియామకాల ప్రక్రియకు కలెక్టర్ ఓ. ఆనంద్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సోమవారం ఇద్దరికి నియామక పత్రాలను అందజేశారు. ఈ నెల 21న సాక్షిలో ‘‘కొత్తసారుపై కొండంత ఆశ’’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. కారుణ్య నియామకాల ప్రక్రియ నెలలోగా పూర్తి చేయాలని పరిపాలనా విభాగం అధికారులను ఆదేశించిన ఆయన.. వెనువెంటనే చర్యలకు ఉపక్రమించారు. ఐసీడీఎస్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ మరణించిన వెంకటరమణ కుమారుడు రంగనాథ్‌కు పోలీసుశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. వీఆర్‌ఓ గ్రేడ్–2 విధులు నిర్వర్తిస్తూ మరణించిన సుధాకర్‌రెడ్డి సతీమణి సుశీలమ్మకు విభిన్న ప్రతిభావంతుల శాఖలో ఓఎస్‌డీగా ఉద్యోగం కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధ్యతగా విధులు నిర్వర్తించి అందరి మన్ననలు అందుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ మలోల, పరిపాలనాధికారి అలెగ్జాండర్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీటీ పరిరక్షణ కమిటీకి సంపూర్ణ మద్దతు

ఆర్డీటీ పరిరక్షణ కమిటీకి సంపూర్ణ మద్దతు