
కక్ష కట్టి.. కటకటాలపాలై
● గంజాయి కేసులో ట్విస్ట్
● స్నేహితుడిని ఇరికించాలనుకుని ‘ఇరుక్కున్న’ యువకుడు
రాయదుర్గం: వారిద్దరూ స్నేహితులు. అయితే, ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో స్నేహితుడిని ఎలాగైనా జైలుకు పంపించాలనుకుని మరో స్నేహితుడు భావించాడు. బంధువులతో కలసి పన్నాగం పన్నాడు. చివరికి తాను పన్నిన ఉచ్చులో తానే చిక్కి కటకటాలపాలయ్యాడు. ఆదివారం రాయదుర్గంలో దొరికిన గంజాయికి సంబంధించి మొత్తం వివరాలను అర్బన్ సీఐ జయనాయక్ వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. పట్టణానికి చెందిన గోళ్ల అఖిల్, ముత్తురాసి హరికృష్ణ స్నేహితులు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో అఖిల్‌ను ఎలాగైనా గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపాలని హరికృష్ణ భావించాడు. ఇందుకు తన మామ ముత్తురాసి అనిల్ సాయం కోరాడు. కొన్ని రోజుల క్రితం శెట్టూరు మండలం చిన్నంపల్లికి చెందిన ముత్తరాసి శంకర్ వద్ద రూ. 3 వేలకు 370 గ్రాముల గంజాయి కొనుగోలు చేశారు. దీంతో పాటు సుమారు 10 కిలోల బరువున్న తొమ్మిది శ్రీగంధం ముక్కలను సిద్ధం చేసుకున్నారు. గంజాయి, శ్రీ గంధం ముక్కలను ఆదివారం పట్టణంలోని కణేకల్లు రోడ్డులో నివాసం ఉండే గోళ్ల అఖిల్ ఇంటి ముందు ఉంచే ప్రయత్నం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అర్బన్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ముత్తురాసి హరికృష్ణ, ముత్తురాసి అనిల్‌తో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నేరాన్ని వారు అంగీకరించారు.
తీగ లాగితే డొంక కదిలింది
నిందితుల విచారణలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. తీగ ఇక్కడ లాగితే డొంక శెట్టూరు మండలం చిన్నంపల్లికి చేరింది. గ్రామానికి చెందిన ముత్తురాసి శంకర్ తన పొలంలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడని, అక్కడే 370 గ్రాములు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. సోమవారం నిందితులను వెంట తీసుకెళ్లి శంకర్ పొలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మరో 214 గ్రాముల గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 584 గ్రాముల గంజాయితో పాటు 2 సెల్‌ఫోన్లు, బజాజ్ డిస్కవర్ మోటార్ సైకిల్, ఒక కొడవలి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ జయనాయక్ తెలిపారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారన్నారు. గంజాయి సాగు చేసిన ముత్తురాసి శంకర్ ఆచూకీ లభించలేదని సీఐ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు.