
ఈ రోడ్డులో ఎలా ప్రయాణించాలి?
బొమ్మనహాళ్: అధ్వానంగా ఉన్న రోడ్డులో ఎలా ప్రయాణించాలంటూ మండలంలోని బండూరు గ్రామానికి చెందిన యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బండూరు–ఉద్దేహాళ్ గ్రామాల మధ్య రోడ్డుపై బురద నీటిలో నిల్చుని నిరసన తెలిపారు. వర్షాకాలంలో బురద, గుంతలతో రాకపోకలు దుర్భరంగా మారాయని వాపోయారు. పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. వెంటనే రహదారి పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం బొమ్మనహాళ్ తహసీల్దార్ మునివేలుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో తిప్పేస్వామి, శివరామ్, రవి, రామృష్ణ, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.