
జెడ్పీలో అక్రమాలు వెలుగు చూసేనా?
● మొదలైన అకౌంటెంట్ జనరల్ ఆడిట్ ప్రక్రియ
● పది రోజుల పాటు కొనసాగనున్న ఆడిట్
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ కార్యాలయంలో అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆడిట్ ప్రక్రియ మొదలైంది. విజయవాడ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం అనంతపురం జెడ్పీకి సోమవారం చేరుకుంది. 2019–2020 ఆర్థిక సంవత్సరం నుంచి 15వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్, బీఆర్‌జీఎఫ్, ఎస్‌ఎఫ్‌సీ, ఇతర పద్దుల కింద ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించిన అన్ని రికార్డులూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బడ్జెట్ రాబడులు–ఖర్చులకు సంబంధించిన ప్రతి అంశాన్నీ నిశితంగా చూస్తున్నారు. అయితే పాలకవర్గం అనుమతి లేకుండా కొన్ని, పాలకవర్గం తిప్పికొట్టిన మరికొన్ని పనులకు సంబంధించిన బిల్లులు గతంలో పని చేసిన సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు, కిందిస్థాయి సిబ్బంది కుమ్మకై ్క డ్రా చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఓఅండ్‌ఎంకు సంబంధించి తప్పుడు అగ్రిమెంట్లు, నకిలీ బిల్లులు పెట్టి రూ.కోట్లు కొట్టేశారని గతంలో జెడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ సాధారణ, స్థాయీ సంఘాల సమావేశాల్లో నిలదీశారు. అయినా అప్పటి అధికారులు కనీస విచారణ కూడా చేయలేకపోయారు. చివరకు లోకాయుక్తకు కూడా ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. గ్రామాల్లో వీఎల్‌సీ (విలేజ్ లెవల్ కమిటీ) ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులను కూడా కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బినామీ పేర్లతో పూర్తి చేసి రూ.కోట్లు స్వాహా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలోని ఓ మారుమూల మండలంలో రూ.2 కోట్లకు పైగా ఇలా నిధులను ఓ అధికారి మరో కాంట్రాక్టర్‌తో చేతులు కలిపి దిగమింగారని తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి వచ్చిన ఆడిట్ అధికారుల పరిశీలనలో అక్రమాలు వెలుగు చూసేనా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సుమారు పది రోజుల పాటు ఏజీ ఆడిట్ ప్రక్రియ కొనసాగుతుందని జెడ్పీ వర్గాలు తెలిపాయి. నిష్పక్షపాతంగా ఆడిట్ ప్రక్రియ కొనసాగితే అక్రమాలు వెలుగు చూసే అవకాశం లేకపోలేదని జెడ్పీ వర్గాలే అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.