
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమమే
● వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకాశి
అనంతపురం అర్బన్: సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకాశి స్పష్టం చేశారు. వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ ఎదుట ఽవీఆర్‌ఏలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకాశి మాట్లాడుతూ వీఆర్‌ఓలకు పేస్కేల్ రూ.30 వేలు వర్తింపజేయాలన్నారు. డీఏలతో వేతనం ఇవ్వాలన్నారు. కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. విద్యార్హతను బట్టి పదోన్నతులు కల్పించాలన్నారు. నామినీ వీఆర్‌ఏలను రెగ్యులర్ వీఆర్‌ఏలుగా మార్పు చేయాలన్నారు. వీఆర్‌ఏలకు పదోన్నతి కల్పించడం ద్వారా వీఆర్‌ఓ పోస్టులు 70 శాతం భర్తీ చేయాలన్నారు. విధినిర్వహణలో వీఆర్‌ఓ మరణిస్తే ఆయన కుటుంబంలో ఒకరికి వీఆర్‌ఏ ఉద్యోగం ఇవ్వాలన్నారు. కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. అనంతరం కలెక్టర్ ఆనంద్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్వరప్ప, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు విజయ్, వీఆర్‌ఏ సంఘం నాయకులు సుధాకర్, సుబ్రమణ్యం, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.