
‘బలిజలకు మేలు చేసిందేమీ లేదు’
గుత్తి: బలిజ కులస్తులను అగౌరవపరిచే విధంగా ఉన్న జీఓ నంబర్–5ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందూ జనార్దన్ డిమాండ్ చేశారు. రాయలసీమ పర్యటనలో భాగంగా సోమవారం గుత్తికి విచ్చేసిన ఆయన ఆర్‌అండ్‌బీ బంగ్లాలో బలిజ సంఘం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం దొమ్మర్లను తీసుకొచ్చి బలిజ కులంలో కలిపి ‘గిరి బలిజ’ అనే నామకరణ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది బలిజలను అగౌరవ పరచడమేనన్నారు. వెంటనే జీఓ–5 ను రద్దు చేయాలన్నారు. గిరి బలిజలో ‘బలిజ’ పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 15 మాసాలు గడిచిపోయినా ఇంతవరకు బలిజలకు ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరారు. కూటమి లో జనసేన భాగస్వామి అయినప్పటికీ జన సైనికులకు పదవుల కేటాయింపులో సముచిత న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బలిజ సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఆమరణ దీక్ష చేస్తానన్నారు. అనంతరం కాపు ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కాపు ఉద్యోగుల సమస్య ఒక్కటీ పరిష్కారం చేయలేదన్నారు. పది లక్షల మంది ఉద్యోగులు ఉద్యమ బాట పట్టడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గుంతకల్లు, గుత్తి బలిజ సంఘం అధ్యక్షులు పూల రమణ, మారాకుల రమణ, ఉపాధ్యక్షులు శ్రీకరం గోవింద రాజులు, సీనియర్ నాయకులు నరేష్, గోరంట్ల నాగయ్య, మంజు, మోహన్, హరి, ఈశ్వరయ్య, రాజశేఖర్, నాగరాజు, ఈశ్వరయ్య పాల్గొన్నారు.