
సెపక్‌తక్రా పోటీల రన్నర్ ‘అనంత’
● ముగిసిన రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీలు
ఉరవకొండ: రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీల ఓవరాల్ విజేతగా కృష్ణా జిల్లా బాలబాలికల జట్లు నిలిచాయి. ఉరవకొండలోని జెడ్పీ సెంట్రల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 21 నుంచి జరుగుతున్న 28వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి సబ్ జూనియర్ బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి. అనంతపురం, కృష్ణా జిల్లాల బాలబాలికల జట్లు ఫైనల్స్‌లో తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో కృష్ణా జిల్లాకు చెందిన బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. అనంతపురం జిల్లా జట్లు రన్నరప్స్‌తో సరిపెట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవ సభలో ముఖ్య అతిథిగా భారతదేశ సెపక్‌తక్రా క్రీడల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా చైర్మన్ సప్తగిరి మల్లి, కార్యదర్శి షాహిన్, ఎస్‌కెఆర్‌సీ క్లబ్ ఉపాధ్యక్షులు ఎర్రిస్వామినాయుడు, ఆమిద్యాల రాజశేఖర్ హాజరయ్యారు. గెలుపోటములను సమానంగా స్వీకరించినపుడే క్రీడల్లో రాణిస్తారని వక్తలు తెలిపారు. అనంతరం విన్నర్స్, రన్నర్స్ జట్లకు పతకాలు, కప్‌లు, సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో సీనియర్ పీడీలు మారుతిప్రసాద్, పుల్లా రాఘవేంద్ర, నాగరాజు, ప్రభాకర్, మంజునాథ్, జనార్దన్, శివకుమార్, రాయుడు, కృష్ణ, నాగేంద్ర పాల్గొన్నారు.