
కాసం ఫ్యాషన్స్ ప్రారంభం
గుంతకల్లు: కాసం ఫ్యాషన్స్ వారి 19వ స్టోర్ గుంతకల్లులోని రైల్వేస్టేషన్ రోడ్డులో సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా సినీనటి నిధి అగర్వాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫ్యాషన్ అభిరుచి ఉన్నవారు గతంలో నగరాలకు వెళ్లి షాపింగ్ చేసేవారన్నారు. ఇప్పుడు అధునాతన కలెక్షన్స్, నిత్యం నూతన వైరెటీలు కాసం ఫ్యాషన్స్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ మాట్లాడుతూ తగ్గిన జీఎస్టీకి అనుగుణంగా తక్కువ ధరకే తమ షాపుల్లో వస్త్రాలు లభిస్తాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం నిధి అగర్వాల్ మాల్‌లో కలియదిరిగారు. షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన స్టేజ్‌పై అభివాదం చేస్తూ సినీ పాటకు డాన్స్ వేసి అభిమానులను అలరించారు. కార్యక్రమంలో కాసం ఫ్యాషన్ యాజమాన్యం అరుణ్‌కుమార్, విశాల్, వరుణ్, కార్తీక్, సాయి పాల్గొన్నారు.
భార్య మందలించిందని ఆత్మహత్య
బొమ్మనహాళ్: భార్య మందలించిందని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ నబీరసూల్ తెలిపిన వివరాల మేరకు.. సింగానహళ్లికి చెందిన కురుబ మోహన్ (41) మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండేవాడు. కొద్దిరోజుల క్రితం ఇంటి వద్దనున్న బైక్‌ను ఎక్కడో కుదువపెట్టి వచ్చిన డబ్బుతో పూటుగా మద్యం తాగొచ్చాడు. ఈ విషయమై భార్య గీత మందలించడంతో మనస్తాపానికి గురైన మోహన్ ఆదివారం ఇంట్లోనే గడ్డికి కొట్టే మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం మోహన్ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాసం ఫ్యాషన్స్ ప్రారంభం