
చౌక బియ్యం పట్టివేత
పెద్దపప్పూరు: అమ్మలదిన్నెలో సూర్యనారాయణ అనే వ్యక్తి వద్ద నిల్వ ఉంచిన 15 బస్తాల చౌక బియ్యాన్ని సోమవారం పట్టుకుని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. బియ్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులకు స్వాధీనం చేశామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు అందించే చౌక బియ్యాన్ని ఎవ్వరు కొనుగోలు చేసినా, అక్రమంగా రవాణా చేసినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
న్యాయమైన డిమాండ్లు
పరిష్కరించాలి
అనంతపురం అర్బన్: విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదురుగా సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగ, కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జీటీ శ్రీనివాసులు, కన్వీనర్ హర్ష మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు పూర్తిగా వైద్య ఖర్చులు చెల్లించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. దీర్ఘకాలిక సర్వీసు ఉన్న వారిని సంస్థలో విలీనం చేయాలన్నారు. కారుణ్య నియామకాలు కల్పించడంలో కన్సాలిడేటెడ్ పే విధానానిన రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలన్నారు. 2019లో నియమించిన ఎనర్జీ అసిస్టెంట్లు (జేఏల్‌ఎం గ్రేడ్–2)లను రెగ్యులర్ జేఎల్‌ఎంలుగా పరిగణించి వేతనాల, ఇతర ప్రయోజనాలు కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలన్నారు. అమలులో ఉన్న ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ప్రకారం స్కేల్ రూపొందించాలన్నారు. ఇలా తమ న్యాయమైన అన్ని డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ఆనంద్‌ను నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ కో–కన్వీనర్లు శ్రీనివాసులు, జితేంద్ర, జిలాన్, రాము, నాగార్జున, ఎస్‌ఎం బాషా పాల్గొన్నారు.