
‘మూల్యాంకనం’రెమ్యునరేషన్ చెల్లించండి
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి మూల్యాంకన విధులకు సంబంధించిన రెమ్యునరేషన్, టీఏ, డీఏ చెల్లించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు డి.మారుతి ప్రసాద్, కోశాధికారి ప్రదీప్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం అనంతపురం డీఈఓ ఎం.ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ పదో తరగతి వార్షిక పరీక్షలు–25లో సిట్టింగ్ స్క్వాడ్ పారితోషికం పెండింగ్ ఉందన్నారు. 2008, 2018 డీఎస్సీ ఉపాధ్యాయులకు జాయినింగ్ తేదీలు వేర్వేరుగా ఉన్నందున బదిలీల్లో పాయింట్ల తేడా ఎక్కువగా ఉందన్నారు. ఒకే తేదీ జాయినింగ్ ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. బదిలీ అయి రిలీవర్ లేని కారణంగా తిరిగి పాతస్థానాల్లో పనిచేసే ఉపాధ్యాయులను రిలీవ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి భాషా పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు లేకుండా చూడాలన్నారు. అసెస్‌మెంట్ పుస్తకాల నిర్వహణపై పున:సమీక్షించాలన్నారు. హైస్కూల్ ప్లస్‌లలో ఖాళీ స్థానాలలో ఉపాధ్యాయుల నియామకం చేపట్టి వాటిని యథావిధిగా కొనసాగించాలన్నారు. మునిసిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సమస్యలను పరిష్కరించాలని, మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ ప్రకటించాలన్నారు. విద్యా శక్తి కార్యక్రమం ఐచ్ఛికంగా నిర్వహించాలని కోరారు.