
రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాలు, ఉద్యోగులకు పదోన్నతులు
అనంతపురం అర్బన్: ఒక ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబాన్ని ఆర్థిక సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులు చుట్టుముడతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఆసరా కల్పిస్తూ కుటుంబంలో ఒకరికి వీలైనంత త్వరగా కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారు. ఈ కారుణ్య నియామకాలు కలెక్టర్ కార్యాలయం నుంచి జరుగుతాయి. ఈ ఏడాది మే నాటికి 32 కారుణ్య నియామకాలు కల్పించాల్సి ఉండగా నాలుగు నెలల్లోనే ఆ సంఖ్య 104కు చేరింది. ఒకవైపు కుటుంబ పెద్దదిక్కు లేడన్న బాధ.. మరో వైపు పోషణ భారం వెరసి ఉద్యోగం ఎప్పుడిస్తారా అని కలెక్టర్ కార్యాలయం చుట్టూ బాధితులు తిరుగుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారుల నుంచి మాత్రం స్పందన లేకపోవడంతో వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. కష్టం బయటికి చెప్పుకుంటే ఎక్కడ ఇబ్బంది పెడతారో అని ఆందోళన చెందుతున్నారు.
పదోన్నతుల కోసం ఎదురు చూపు
రెవెన్యూలో పదోన్నతుల కోసం కిందిస్థాయి ఉద్యోగులు కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. గత కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా కరుణించలేదని ఉద్యోగులు వాపోతున్నారు. వివిధ కేడర్లలో పోస్టులు ఖాళీ ఉండి, పదోన్నతికి అర్హత సాధించిన వారు ఉన్నప్పటికీ ఆ విషయంపై దృష్టి సారించలేదని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో పదోన్నతుల ప్రక్రియ ఎప్పుడో పూర్తయ్యిందని ఉద్యోగులు చెబుతున్నారు.
జేఏలకు భాగ్యమేదీ?
రెవెన్యూ శాఖలో ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్ (జేఏ) పోస్టులు 9, సీనియర్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులు 32, డిప్యూటీ తహసీల్దారు (డీటీ) పోస్టులు 17, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దారు (సీఎస్‌డీటీ) పోస్టులు 26 ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఇక.. జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పిస్తారు. జేఏలు తప్పనిసరిగా సర్వే, డిపార్ట్‌మెంటల్, అకౌంట్, తదితర పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే, అన్ని టెస్టులు పాసై అర్హత సాధించిన వారు 30 మంది ఉన్నారు. శాఖలో 32 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన వీఆర్‌ఓలకూ ఎస్‌ఏలుగా పదోన్నతి కల్పిస్తారు. మొత్తం ఖాళీల్లో వీఆర్‌ఓలు, జేఏలకు 40ః60 నిష్పత్తిలో పదోన్నతి కల్పిస్తారు. వీఆర్‌ఓలకు పదోన్నతి ఇప్పటికే కల్పించారని, తమ విషయంలో జాప్యం చేశారని జేఏలు ఆవేదన చెందుతున్నారు.
డీటీలుగా పదోన్నతి దక్కేనా..?
ఎస్‌ఏలకు డీటీలుగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం డీటీలుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన ఎస్‌ఏలు 15 మంది ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ నెలలుగా ముందుకు సాగకపోవడంతో వారికీ ఎదురు చూపులు తప్పడం లేదు. పీబీడీటీలు వచ్చినా పోస్టుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాకు కేటాయించిన పీబీడీటీలు ఏడాది పాటు శిక్షణలో ఉంటారని, అటు తరువాత పీబీడీటీలకు సంబంధించి ప్రభుత్వం సూపర్‌న్యూమరరీ పోస్టులు మంజూరు చేస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం సూపర్‌న్యూమరరీ పోస్టులు మంజూరు చేయకపోయినా రెగ్యులర్ డీటీలను సీఎస్‌డీటీలుగా నియమించి, వారి స్థానంలో పీబీడీటీలను నియమించవచ్చంటున్నారు.
పెండింగ్‌లో కారుణ్య నియామకాలు
కళ్లకు కాయలు కాసేలా బాధిత కుటుంబాల ఎదురుచూపులు
రెవెన్యూలో నిలిచిన పదోన్నతులు
కరుణ చూపాలంటున్న ఉద్యోగులు