
అధికార అండతో భూమి కబ్జా
ఉరవకొండ: అధికారాన్ని అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా అమాయకుల భూమిని కబ్జా చేయాలని చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ఎస్పీ జగదీష్‌ను జిల్లా పోలీసు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడపనకల్లు మండలం జనార్దన్‌పల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నం. 141లోని 21.05 ఎకరాలను 2023 జూన్ 4న రైతు జయకుమార్ కొనుగోలు చేసి, పంటలు సాగు చేస్తున్నాడన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ భూమిపై జనార్దన్‌పల్లి సర్పంచ్ రామంగి జనార్దన్‌నాయుడు, టీడీపీ నాయకులు సుధాకర్, పాండురంగ, కురపాటి కృష్ణమూర్తి కన్నేశారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇటీవల రైతు జయకుమార్‌పై దౌర్జన్యానికి దిగారన్నారు. రైతును పొలంలోకి రానివ్వకుండా అడ్డు పడుతున్నారన్నారు. దీనిపై న్యాయస్థానం ఇంజెంక్షన్ ఆర్డర్ ఇచ్చినా ఏ మాత్రమూ లెక్కచేయడం లేదన్నారు. బాధిత రైతుకు పోలీసు రక్షణ కల్పించి తన పొలంలో పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు.
కూడేరు సీఐపై చర్యలు తీసుకోవాలి..
కూడేరు సీఐ రాజు వైఎస్సార్‌సీపీ శ్రేణులెవ్వరూ పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కరాదని అంటున్నారని, ఎంపీపీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలను సైతం ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని విశ్వ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల 70 ఏళ్ల వయసున్న అంతరగంగ సర్పంచ్ ఓబుళేసు స్టేషన్‌కు వెళితే బూతులు తిట్టి తీవ్రంగా అవమానపరిచాడన్నారు. తమ పార్టీలో చురుగ్గా ఉన్న నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడన్నారు. బోర్‌వెల్‌తో జీవనం సాగిస్తున్న మరుట్ల–1 గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త శ్రీనివాసులుపై కక్ష కట్టి ఉపాధి దెబ్బతీశాడన్నారు. బోరు బండి కావాలంటే టీడీపీ కండువా వేసుకోవాలంటూ శ్రీనివాసులును హెచ్చరించాడన్నారు. అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్న సీఐ రాజుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జల్లిపల్లి దేవేంద్ర, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లత్తవరం కౌడిగి గోవిందు, కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు మంజునాథ్‌రెడ్డి, మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మరుట్ల శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
కోర్టు ఆర్డర్‌నూ లెక్క చేయని
టీడీపీ నాయకులు
బాధితుడికి పోలీసు రక్షణ కల్పించి పొలంలోకి తీసుకెళ్లాలి
అధికార పార్టీకి తొత్తుగా మారిన కూడేరు సీఐపై
చర్యలు తీసుకోవాలి
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ
సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి
ఎస్పీ జగదీష్‌కు వినతిపత్రం