
తప్పుడు ప్రచారంతో తండోపతండాలుగా
తాడిపత్రి రూరల్: బస్సు దొరకలేదంటే ఆటోలు పట్టుకునో... అవీ లేకుంటే మనవడో, కుమారుడినో ప్రాధేయపడి ద్విచక్రవాహనాల్లోనో తరలివస్తున్నారు. దరఖాస్తులు ఇవ్వకుంటే ఎక్కడ డబ్బులు అందకుండా పోతాయోనన్న భయంతో పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. త్వరలో ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం అమలు చేస్తుందని, ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే వితంతులకు రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తారని ఇటీవల కొందరు తప్పుడు ప్రచారం చేస్తుండడంతో పేద మహిళలు తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారితో శనివారం తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయ పరిసరాలు రద్దీగా మారాయి. కార్యాలయం సమీపంలోని జిరాక్స్ సెంటర్ వద్ద దరఖాస్తులు తీసుకొని, వాటిని నింపాక గాబారా పడుతూ కార్యాలయంలో అందించడం కనిపించింది. రోజు కూలి వదులు కుని మరీ కొందరు రావడం గమనార్హం. అలాంటి పథకమేదీ లేదని, డబ్బులు రావని చెబుతున్నా వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దరఖాస్తులు తీసుకుంటున్నామని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. కాగా, ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ సోమశేఖర్ వివరణ కోరగా ఆయన స్పందించారు. ఫ్యామిలీ బెనిఫిట్ స్కీంకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ఈ విషయం తెలిపినా వితంతువులు వినడం లేదని చెప్పారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు. ఏవైనా ఉత్తర్వులు వస్తే సచివాలయ సిబ్బంది ద్వారా సమాచారం అందిస్తామన్నారు.