
టిప్పర్ కింద పడి యువకుడి దుర్మరణం
రాప్తాడు: టిప్పర్ కింద పడి యువకుడు దుర్మరణం పాలైన ఘటన మండలంలోని గొందిరెడ్డిపల్లిలో జరిగింది. వివరాలు.. మండలంలోని రామినేపల్లికి చెందిన మందల శ్రీనివాసులు, రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. శ్రీనివాసులు శ్రీ సత్యసాయి జిల్లాలోని కనగానపల్లి సమీపంలో 2 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని టమాట పంట సాగు చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం శ్రీనివాసులు చిన్న కుమారుడు మందల శ్రీకాంత్ (28) ద్విచక్ర వాహనంలో తోట దగ్గరకు వెళ్లి పంటకు పురుగుల మందు పిచికారీ చేసిన అనంతరం తిరుగుపయనమయ్యాడు. గొందిరెడ్డిపల్లి సమీపంలోకి రాగానే ఎదురుగా అతివేగంగా టిప్పర్ వస్తుండడాన్ని గమనించి ద్విచక్ర వాహనాన్ని పీర్ల చావిడి వెనుక వైపు మలుపు వద్ద ఆపాడు. అయితే, డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బైకును టిప్పర్ ఢీకొంది. ఈ క్రమంలోనే కిందపడిన శ్రీకాంత్‌పై టిప్పర్ చక్రాలు వెళ్లడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు ఘటనా స్థలికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.