
రైతు కష్టం.. దళారుల పాలు
పెద్దపప్పూరు: టమాట మార్కెట్లలో దళారులు చెలరేగిపోవడంతో జిల్లాలో టమాట సాగు చేసిన రైతులు నష్టాలు చవిచూడక తప్పడం లేదు. చివరకు పొరుగు జిల్లాలోని మార్కెట్‌కు తరలించినా గిట్టుబాటు ధర లభ్యం కాక టమాటను ఎక్కడికక్కడ పడేస్తున్నారు. పంటకోత దశలో వరుసగా వర్షాలు కురవడంతో కాయలో నాణ్యత లోపించింది. చేతికందిన దిగుబడిలోనే రైతులు గ్రేడింగ్ చేసి నాణ్యమైన కాయలను మార్కెట్‌కు తరలిస్తున్నారు. అయినా ధర గిట్టుబాటు కాక తల్లడిల్లిపోతున్నారు.
వారం రోజుల్లోనే పడిపోయిన ధరలు..
తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు, యాడికి, తాడిపత్రి మండలాల్లో దాదాపు 400 ఎకరాల్లో టమాటను రైతులు సాగు చేస్తున్నారు. వారం రోజుల క్రితం వరకూ నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్‌లో 25 కిలోల టమాట బాక్సు రూ.250 నుంచి రూ.400 వరకు ధర పలికింది. దీంతో కనీసం పెట్టుబడులైనా దక్కుతాయని భావించిన రైతులు ఎక్కువగా ప్యాపిలి మార్కెట్‌పై ఆధారపడ్డారు. తాజాగా శనివారం పెద్దపప్పూరు మండలంలోని గార్లదిన్నె, పసలూరు, కొట్టాలపల్లి తదితర గ్రామాల రైతులు తమ టమాట పంటను ప్యాపిలి మార్కెట్‌కు తరలించారు. అయితే గిట్టుబాటు ధర లభ్యం కాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పంటను మార్కెట్‌లోనే పడేసి ఖాళీ బాక్సులతో ఇంటికి చేరుకున్నారు. మార్కెట్‌లో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల కష్టం దళారుల పాలవుతోంది. ఆరుగాలం శ్రమించి టమాట పండించిన రైతులు ఓ వైపు అకాల వర్షం నుంచి పంటను కాపాడుకోవడానికి, మరో వైపు అధిక వర్షాల కారణంగా తెగుళ్ల బారి నుంచి పంట దిగుబడులు కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. చివరకు దిగుబడిని మార్కెట్‌కు తరలిస్తే దళారుల ఇష్టారాజ్యంతో నిలువుదోపిడీకి గురవుతున్నారు.
మార్కెట్‌లో పడిపోయిన టమాట ధరలు
ప్యాపిలి మార్కెట్‌లో 25 కిలోల బాక్సు రూ.100 లోపే
దిగుబడిని మార్కెట్‌లోనే
వదిలేసి వచ్చిన టమాట రైతులు