
గత టీడీపీ ప్రభుత్వంలో పీపీపీ పద్ధతిలో మెడాల్ ప్రాజెక్ట
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పీపీపీ.. క్లుప్తంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్. ఈ పేరు టీడీపీకి బాగా అలవాటైన పదం. గతంలో పీపీపీ పేరున ‘నీకింత నాకింత’ అన్న చందాన దోచుకున్న తీరు జిల్లావాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది. అసలు ఈ పీపీపీ పద్ధతి పురుడు పోసుకున్నదే అనంతపురం జిల్లాలో కావడం గమనార్హం. అనంతపురం కరువు జిల్లా అని, తనకు ప్రాణమని చెప్పే చంద్రబాబు ఇక్కడి నుంచే దోపిడీ మొదలుపెట్టారనే విమర్శలు ఉన్నాయి.
మూడు నెలల్లోనే రాష్ట్రమంతటా..
2014లో రాష్ట్రం విడిపోయింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అధికారం చేపట్టారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా రక్తపరీక్షల నిర్వహణ ప్రైవేటుకు అప్పజెబుతూ నిర్ణయించారు. దీనికి బీజం అనంతలోనే వేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఇక్కడ 6 మాసాలు నిర్వహించి ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరించాలనేది యోచన. అయితే, మూడు నెలలు కూడా అమలు కాకనే రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ఆదేశాలిచ్చారు.
రూ.300 కోట్ల దోపిడీ..
2019 నాటికి అంటే ఆరేళ్ల క్రితమే పీపీపీ పద్ధతి ద్వారా అనంతపురం జిల్లాలో బీజం పడిన ఈ ప్రాజెక్టు ద్వారా సదరు ప్రైవేటు సంస్థ రూ.300 కోట్ల అవినీతికి పాల్పడినట్టు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని పలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో రక్తపరీక్షలు చేయకపోయినా చేసినట్టు డాష్‌బోర్డులో చూపి కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారు. 2019 తర్వాత కొత్త సర్కారు వచ్చాక పీపీపీ పద్ధతిని రద్దు చేసి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సొంతంగా రక్త పరీక్షల నిర్వహణకు లేబొరేటరీలు పునరుద్ధరించింది.
ఇప్పుడు మళ్లీ..
‘సూపర్‌సిక్స్–సూపర్‌హిట్’ అంటూ అమలు కాని పథకాలనూ అమలు చేసినట్లు డప్పు కొట్టుకున్న ‘అనంత’ వేదిక నుంచే మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే పెనుకొండలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల పనులు కూటమి సర్కారు వచ్చాక నిలిచిపోయాయి. 50 ఎకరాల్లో రూ.375 కోట్లతో కళాశాలను నిర్మించాలని గత వైఎస్సార్ సీపీ సర్కారు యోచించింది. అప్పట్లోనే రూ.30 కోట్లు ఖర్చు చేసింది. కానీ చంద్రబాబు తాజాగా ‘పీపీపీ’ అనడంతో పెనుకొండ మెడికల్ కాలేజీకి గ్రహణం పట్టినట్టయింది. స్వయానా ఈ నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్న సవిత కళాశాలను కాపాడుకోవాల్సి పోయింది మౌనంగా ఉండటం మరిన్ని విమర్శలకు తావిస్తోంది.
ప్రైవేటు వ్యక్తులైతే జవాబుదారీగా ఉంటారట..!
మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటుకు అప్పజెబుతున్నాం. పీపీపీ పద్ధతిలో ఇవ్వాలని నిర్ణయించాం. ప్రైవేటు వ్యక్తులైతే నిర్వహణ పరంగా జవాబుదారీగా ఉంటారు. ప్రభుత్వానికి 50 శాతం సీట్లు వస్తాయి. మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు.
– ఈనెల 10న అనంతపురంలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలివీ
గత టీడీపీ ప్రభుత్వంలో ‘పీపీపీ’ మాటున రూ. కోట్లు కొల్లగొట్టిన మెడాల్
అప్పట్లో అనంతపురంలోనే పురుడు పోసుకున్న ప్రాజెక్టు
రక్తపరీక్షలు చేయకుండానే చేసినట్టు చూపి ఖజానాకు కన్నం
ఇప్పుడు మెడికల్ కాలేజీలు పీపీపీలోకి అంటూ ‘అనంత’లోనే బాబు స్పష్టత
దోపిడీకి మళ్లీ జిల్లా నుంచే రాచబాట వేశారంటూ
సర్వత్రా విమర్శలు