
రెచ్చిపోయిన ‘పచ్చ’ నేతలు
● భార్యాభర్తపై కర్రలతో
విచక్షణారహితంగా దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘పచ్చ’ నేతలు రెచ్చిపోయారు. భార్యాభర్తపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు.. తలుపూరు గ్రామానికి చెందిన గోసల కొండా, గోసల ఎర్రమ్మ భార్యాభర్తలు. వీరు శనివారం గ్రామ సమీపంలోని తమ పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నేతలు అక్కడికి వెళ్లారు. ఈ భూమిలో వ్యవసాయం ఎలా చేస్తారు అంటూ దౌర్జన్యానికి దిగారు. సర్వే నంబర్ 68కు సంబంధించి భూమి సమస్య పెండింగ్‌లో ఉందని, తాము వ్యవసాయం చేస్తున్నది సర్వే నంబర్ 69లో అని గోసల కొండ చెబుతున్నా వినలేదు. భార్యాభర్తపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గోసల యర్రమ్మ తలకు తీవ్ర గాయాలు కాగా, కొండా కాలికి గాయమైంది. వెంటనే వారిని స్థానికులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యర్రమ్మ తలకు వైద్యులు కుట్లు వేశారు. కొండా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ నేతల ప్రోద్బలంతోనే తమపై దాడి చేశారని బాధితులు వాపోయారు. ఎర్రమ్మ ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.