జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,542 కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,542 కేసుల పరిష్కారం

Sep 14 2025 2:34 AM | Updated on Sep 14 2025 2:34 AM

జాతీయ

జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,542 కేసుల పరిష్కారం

అనంతపురం: ‘కోర్టు కేసుల్లో ఎవరో ఒకరే గెలుస్తారు. మరొకరు పరాజితులు అవుతారు. కానీ జాతీయ లోక్‌ అదాలత్‌లో లభించే పరిష్కారంలో ఇరువురూ విజేతలే’ అని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావు అన్నారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఇందులో మొత్తం 6,542 కేసులు పరిష్కారమయ్యాయి. 32 మోటార్‌ వాహన ప్రమాద కేసుల్లో రూ.1.26 కోట్లు, సివిల్‌ దావాల్లో రూ.84 లక్షలు, 2,351 ప్రీ లిటిగేషన్‌ కేసుల్లో రూ.1.04 కోట్లు, ఎన్‌ఐ యాక్ట్‌ కేసుల్లో రూ. 1.18 కోట్లు బాధితులకు నష్ట పరిహారం అందించారు. జాతీయ లోక్‌అదాలత్‌కు హాజరైన కక్షిదారులకు ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి సి. సత్యవాణి, అనంతపురం బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ గురుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

తీరని యూరియా కష్టాలు

బొమ్మనహాళ్‌: యూరియా కష్టాలు తీరడం లేదు. రైతు సేవా కేంద్రాలు, ఫర్టిలైజర్స్‌ దుకాణాలు, సొసైటీల వద్దకు యూరియా కోసం రైతులు పరుగులు పెడుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పడిగాపులు కాస్తున్నారు. బొమ్మనహాళ్‌ మండలంలో అయితే రైతులు కష్టాలు చెప్పనలవిగా మారాయి. రాత్రిళ్లలోనే రైతు సేవా కేంద్రాల వద్ద ఆధార్‌ కార్డులు, పాసుపుస్తకాలు, చెప్పులు తదితరాలను క్యూలో ఉంచుతున్నారు. రెండు రోజుల క్రితం యూరియా బస్తాలతో శ్రీధరఘట్ట గ్రామ సొసైటీకి వెళ్తున్న లారీలను మార్గమధ్యంలోని ఉప్పరహాళ్‌ గ్రామంలోనే రైతులు ఆపేశారు. ఇప్పటి వరకు ఒక్క బస్తా ఇవ్వలేదని, అందుకే అడ్డుకున్నట్లు తెలిపారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో శాంతించారు.

ఒకటీ.. రెండే

రైతులకు సరిపడా ఎరువులు అందించడంలో కూటమి సర్కారు విఫలమవుతోంది. అరకొరగా యూరియాను తెప్పిస్తుండడంతో పంపిణీ కేంద్రాలకు రైతులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో పోలీసుల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. గంటల సేపు వేచి ఉన్నా ఒకటి లేదా రెండు బస్తాలే అందుతుండడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. టీడీపీ వారికి 20 నుంచి 30 యూరియా బస్తాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

జంట హత్యల కేసులో

మరొకరికి రిమాండ్‌

రాప్తాడు: గంగలకుంట గ్రామ పొలంలో జరిగిన జంట హత్య కేసులో పది మంది నిందితుల అరెస్ట్‌ తర్వాత తాజాగా శనివారం మరొక నిందితున్ని పోలీసులు అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ప్రత్యేక విచారణ అధికారి, అనంతపురం నాల్గో పట్టణ సీఐ జగదీష్‌ శనివారం వెల్లడించారు. ఈ ఏడాది మే 17న గంగలకుంట గ్రామ పొలంలో గొల్లపల్లికి చెందిన రైతు చిగిచెర్ల నారాయణ రెడ్డి, ముత్యాలమ్మ దంపతులపై టీడీపీ కార్యకర్తలు వేట కొడవళ్లు, కట్టెలతో దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష సాక్షి, మృతుడు నారాయణరెడ్డి కుమారుడు చిగిచెర్ల ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రాప్తాడు పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. మే 19న ఆరుగురు నిందితులను రిమాండ్‌కు పంపారు. అదే నెల 21న మరొక నిందితుడు కోర్టులో లోంగిపోయాడు. అదే నెల 23న ఇంకొక నిందితుడిని, ఈ నెల 12న మరో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అజ్ఞాతంలో ఉన్న చివరి నిందితుడు గొల్లపల్లి పెద్దింటి జగదీష్‌ శనివారం హంపాపురం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై తచ్చాడుతూ కనిపించగా.. పోలీసులు అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. హత్య జరిగి 120 రోజుల తర్వాత మొత్తం 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ కేసులోని 8 మంది నిందితులు 3 నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.

జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,542 కేసుల పరిష్కారం 1
1/2

జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,542 కేసుల పరిష్కారం

జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,542 కేసుల పరిష్కారం 2
2/2

జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,542 కేసుల పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement