
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
● ఉద్యోగుల సమస్యలపై
దృష్టి సారిస్తా..
● నూతన కలెక్టర్ ఓ.ఆనంద్
అనంతపురం అర్బన్: ‘జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, అందరి సహకారంతో ముందుకు వెళతా. ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారిస్తా’ అని నూతన కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా అధికారులు, ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, సిబ్బంది కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద కూడా నూతన కలెక్టర్‌కు ఘన స్వాగతం లభించింది.
జిల్లాకు 104వ కలెక్టర్‌గా బాధ్యతలు
చేపట్టిన ఆనంద్‌తో ‘సాక్షి’ మాటామంతీ.
సాక్షి: జిల్లాకు రావడం ఎలా ఉంది?
కలెక్టర్: అనంతపురం గొప్ప చరిత్ర ఉన్న జిల్లా. ఇక్కడ పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది.
సాక్షి: జిల్లా గురించి...
కలెక్టర్: రాయలసీమ జిల్లాల్లో పనిచేయడం ఇదే తొలిసారి. ముందుగా ఈ జిల్లా గురించి పూర్తిగా తెలుసుకుంటాను.
సాక్షి: కార్యాచరణ ఎలా ఉంటుంది?
కలెక్టర్: జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుంది. అందరి సహకారంతో అన్ని రంగాల్లో జిల్లాను ప్రగతి పథంలో నడిపించే విధంగా చర్యలు ఉంటాయి.
సాక్షి: పదోన్నతుల్లో జాప్యంపై దృష్టి సారిస్తారా?
కలెక్టర్:ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతాం. ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నాను. ఉద్యోగుల పదోన్నతులు ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించి పరిష్కార చర్యలు చేపడతాను.
సాక్షి: ఉద్యోగులకు మీరిచ్చే సందేశం
కలెక్టర్: ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలతో మమేకమై పనిచేయాలి. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలు సత్వరం అందించాలి.
బాధ్యతలు స్వీకరిస్తున్న నూతన కలెక్టర్ ఆనంద్, స్వాగతం పలుకుతున్న అధికారులు
అనంత ప్రగతికి అధికారులు సహకరించాలి
అనంతపురం అర్బన్: ‘‘మనందరి లక్ష్యం జిల్లా అభివృద్ధి. ఇందుకు అన్ని శాఖల అధికారులు సహకారం అందించాలి. శాఖల పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయండి. ముఖ్యమంత్రి నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోలతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పంటల సాగు, యూరియా డిమాండ్, రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌లు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు, సత్యసాయి తాగునీటి పథకం, ప్రజాసమస్యల పరిష్కార వేదిక తదితర అంశాలపై ఆరా తీశారు. సమావేశంలో ఆర్డీఓ కేశవనాయుడు, సీపీఓ అశోక్‌కుమార్, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, డీపీఓ నాగరాజు నాయుడు, మార్క్‌ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం