
ఆగిన ఆలయ అభివృద్ధి
● వీడని కూటమి గ్రహణం
● నిలిచిన ప్రహరీ, పుష్కరిణి పనులు
రాయదుర్గంటౌన్: కలియుగ దైవం శ్రీవేంటేశ్వరస్వామి ఆలయానికి కూటమి ప్రభుత్వ గ్రహణం పట్టింది. రాయదుర్గానికే తలమానికంగా ఉన్న కోటలోని ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చొరవతో ఆలయ ప్రహరీ నిర్మాణంతోపాటు పుష్కరిణికి టీటీడీ నుంచి రూ.2.65 కోట్లు, దేవదాయశాఖ నుంచి రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. 2023లోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు కూడా పనులు ముమ్మరంగా కొనసాగాయి. ఆలయం చుట్టూ పాత గోడను పడగొట్టి మంజూరైన నిధులతో దాదాపు 11 అడుగుల రాతి గోడలు నిర్మించేందుకు పనులు చేపట్టారు. దాదాపు 2 అడుగుల మేర ప్రహరీ నిర్మాణం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగైదు నెలలకే పనులు ఆగిపోయాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు పడకేశాయి.
పుష్కరిణి నిర్మాణంపై నీలినీడలు
ఆలయ అభివృద్ధిలో భాగంగా ప్రహరీ పనులే నిలిచిపోవడంతో ఇక పుష్కరిణి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రహరీ పూర్తి కాకపోవడంతో ఆలయం కళావిహీనంగా కనిపిస్తోందని భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పరిసరాల్లో శుభ్రత లేదని, జంతువులు కూడా లోపలికి వస్తున్నాయని వాపోతున్నారు. ఇటీవల ఆలయ నూతన పాలకవర్గం కూడా కొలువుదీరింది. ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై దేవదాయశాఖ ఈఓ నరసింహారెడ్డిని వివరణ కోరగా.. పనులు నిలిచిపోయిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.