బీమా పరిహారంలో అబ్రకదబ్ర | - | Sakshi
Sakshi News home page

బీమా పరిహారంలో అబ్రకదబ్ర

Sep 14 2025 2:34 AM | Updated on Sep 14 2025 2:34 AM

బీమా పరిహారంలో అబ్రకదబ్ర

బీమా పరిహారంలో అబ్రకదబ్ర

అనంతపురం అగ్రికల్చర్‌: అన్నదాత అడుగడుగునా దగా పడుతున్నాడు. గత రెండేళ్లుగా పంటలు పండక నష్టాల ఊబిలో నిండా మునిగిన రైతులను బీమా పేరుతో చంద్రబాబు సర్కారు మోసపుచ్చుతోంది. 2023 ఖరీఫ్‌, రబీ, అలాగే 2024 ఖరీఫ్‌, రబీలో అమలు చేసిన వాతావరణ బీమా, ఫసల్‌బీమా కింద ఇప్పటికీ పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టే కుట్రలు చేస్తుండటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు ప్రభుత్వాన్ని నమ్మి కట్టిన ప్రీమియం కూడా వెనక్కివచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.

‘ఫస’లేని బీమా..

ఫసల్‌బీమా కింద 2023 ఖరీఫ్‌, 2023 రబీ, అలాగే 2024 ఖరీఫ్‌కు సంబంధించి ఫ్యూచర్‌ జనరిక్‌ బీమా కంపెనీ నుంచి రూ.77.49 కోట్ల పరిహారం విడుదలైందంటూ ఈ ఏడాది ఆగస్టు 12న వ్యవసాయశాఖ విడుదల చేసిన ప్రకటనలో పసలేకుండా పోయింది. 2023 ఖరీఫ్‌లో కంది, ఎండుమిరప, జొన్న రైతులకు రూ.3.39 కోట్లు, రబీలో పప్పుశనగ, వేరుశనగ రైతులకు రూ.15.26 కోట్లు, 2024 ఖరీఫ్‌ కంది, జొన్న రైతులకు రూ.58.83 కోట్లు మొత్తంగా రూ.77.49 కోట్లు విడుదల చేశారని ప్రకటించారు. ఇంత మొత్తం పరిహారం వచ్చిందంటూ రైతుల మొబైల్‌ ఫోన్లకు సమాచారం కూడా పంపించారు. కానీ జమ చేసింది మాత్రం రూ.200, రూ.400, రూ.800 ఇలా చిల్లర విదిలించడం గమనార్హం. ఇదేమని అడిగితే అంతే జమ అయిందని బ్యాంకర్లు చెబుతుండగా... తమకేమీ తెలియదని, కనుక్కుంటామంటూ వ్యవసాయశాఖ చేతులెత్తేస్తోందని రైతులు వాపోతున్నారు.

వాతావరణ బీమాపై మౌనం:

2023, 2024 ఖరీఫ్‌, రబీలో అమలు చేసిన వాతావరణ బీమా పథకం గురించి కూటమి సర్కారు, వ్యవసాయశాఖ మౌనం పాటిస్తోంది. గత రెండేళ్లూ అననుకూల వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు దారుణంగా దెబ్బతినడంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం, సాగు విస్తీర్ణం, చీడపీడల వాతావరణం తదితర డేటా ఆధారంగానే వాతావరణ బీమా కింద పరిహారం ఇవ్వాల్సి ఉన్నా సర్కారు కొలువుదీరి 15 నెలలైనా నోరుమెదపడం లేదు. 2023 ఖరీఫ్‌లో 3.70 లక్షల హెక్టార్లకు గానూ 2.50 లక్షల హెక్టార్లు, 2024 ఖరీఫ్‌లో కూడా 3.47 లక్షల హెక్టార్లకు గానూ 3.20 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. 2023లో వేరుశనగ, పత్తి, చీనీ, దానిమ్మ, టమాట పంటలకు, 2024లో వేరుశనగ, పత్తి, అరటి, టమాట, చీనీ, దానిమ్మ పంటలకు వాతావరణ బీమా వర్తింపజేశారు. పంటల బీమా పథకాలు సక్రమంగా అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు దారుణంగా మోసం చేస్తోందని రైతులు మండిపడుతున్నారు.

ఫసల్‌బీమా కింద రూ.77.49 కోట్లు అంటూ వ్యవసాయశాఖ ప్రకటన

ఇంత మొత్తం పరిహారం

వచ్చిందంటూ రైతులకు సమాచారం

జమవుతోంది మాత్రం చిల్లరే

మోసం చేస్తున్నారని రైతుల ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement