
పచ్చదనంపై వేటు!
రాయదుర్గం/బొమ్మనహాళ్: దశాబ్ధాలుగా నీడ నిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్న భారీ వృక్షాలు గొడ్డలి వేటుకు కనుమరుగవుతున్నాయి. నడి రోడ్డైనా, అటవీ ప్రాంతమైనా, ఇళ్ల వద్దనైనా ఎక్కడైనా సరే పచ్చని చెట్లను నరికేసి కలప అక్రమ రవాణా సాగిస్తున్నారు. దీంతో రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు క్రాస్ నుంచి బొమ్మనహాళ్ మీదుగా కర్ణాటకలోని బళ్లారికి వెళ్లే ప్రధాన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలు కనుమరుగయ్యాయి. దేవగిరిక్రాస్ సమీపాన ప్రధాన రహదారి పక్కన ఉన్న భారీ వృక్షాన్ని ఇటీవల అందరూ చూస్తుండగా కూల్చి కలపను వాహనాల్లో తరలించారు.పలు గ్రామాల్లోని చింతచెట్లు కూల్చి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లోని చాలా మండలాల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో పచ్చదనం తరిగిపోతుంది.
వాల్టా .. ఉల్టా !
జిల్లాలోని కర్ణాటక సరిహద్దున ఉన్న రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో వాల్టా (నీరు, భూమి, వృక్షం) చట్టం అమలు కాగితాలకే పరిమితమైపోయింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు కావస్తున్నా వాల్టా చట్టం పై ఏనాడు సమీక్షా సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా బోర్లు తవ్వుతున్నారు. వృక్ష సంపదను నేల కూలుస్తున్నారు. అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తూ వాగులు, గుట్టలను కొల్లగొడుతున్నారు.
బొమ్మనహాళ్ మండలంలో నరికేసిన చెట్లు
దేవగిరి సమీపంలో భారీ వృక్షాన్ని నరికి కలపను తరలిస్తున్న దృశ్యం
పరిశీలించి చర్య తీసుకుంటాం
కలప అక్రమ రవాణాను కట్టడి చేశాం. దేవగిరి సమీపంలో రోడ్డు పక్కన ఉండే భారీ వృక్షాన్ని కూల్చింది ఎవరో విచారించి చర్యలు తీసుకుంటాం. అటవీశాఖ అనుమతుల్లేకుండా చెట్టు నరికితే క్రిమినల్ చర్యలు చేపడతాం.వాల్టా చట్టం అమలుకు తప్పక కృషి చేస్తాం.
– దామోదరరెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, రాయదుర్గం
దశాబ్దాలుగా నీడనిచ్చిన చెట్ల కూల్చివేత
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా

పచ్చదనంపై వేటు!