
ఉపాధి అవకాశాలు కల్పించాలి
● కలెక్టరేట్ ఎదుట
ఆటో కార్మికుల నిరసన
అనంతపురం అర్బన్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో బాడుగలు లేక జీవనోపాధి కోల్పోయిన తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ప్రభుత్వాన్ని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. భగత్‌సింగ్ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. సంఘం కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడారు. వాహన మిత్ర పథకం కింద ప్రతి ఆటో కార్మికునికి రూ.30 వేలు ఇవ్వాలన్నారు. పట్టణ, మండల కేంద్రాల్లో ఆటో పార్కింగ్ స్థలాలు కేటాయించాలన్నారు. ఓలా, ఊబర్, రాపిడ్ సర్వీసులను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వమే యాప్ నిర్వహించాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం డీఆర్‌ఓ మలోలకు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు చిన్నముత్యాలు, ప్రసాద్‌బాబు, వెంకటరెడ్డి, స్వాతి, ఆరీఫ్, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ బస్సుల ఢీ
● ముగ్గురికి గాయాలు
చెన్నేకొత్తపల్లి: స్థానిక 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకరికి కాలు విరిగింది. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. కేరళలోని అలపూరకు చెందిన ఏడుగురు యువకులు హైదరాబాద్‌లో కావడి ఉత్సవాన్ని ముగించుకుని తమ మినీ బస్సులో ఆదివానం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం ఉదయం చెన్నేకొత్తపల్లి వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారి పక్కన ఆపిన కియా కంపెనీను వెనుక నుంచి ఢీకొనడంతో మినీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కేరళకు చెందిన అర్జున్‌కు ఎడమ కాలు పాదం వద్ద విరిగింది. అగిల్, రాహుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత
తాడిపత్రి రూరల్: పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లి కాలనీలో సోమవారం 99 బస్తాల్లోని 45.7 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 50 బస్తాల్లోని 18.5 క్వింటాళ్ల జొన్నలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ చేసిన నాగార్జునను అరెస్ట్ చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎస్‌ఐ నాగేంద్రభూపతి, సీఎస్‌డీటీ మల్లేష్, వీఆర్వో వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.