భూములు బీడు.. రైతుల గోడు | - | Sakshi
Sakshi News home page

భూములు బీడు.. రైతుల గోడు

Sep 9 2025 8:17 AM | Updated on Sep 9 2025 12:28 PM

భూములు బీడు.. రైతుల గోడు

భూములు బీడు.. రైతుల గోడు

అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌ పంటల సాగు 2.56 లక్షల హెక్టార్లకు చేరింది. ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 3.43 లక్షల హెక్టార్లు కాగా 75 శాతం విస్తీర్ణంలో పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక విడుదల చేసింది. ఈ లెక్కన ఇంకా 87 వేల హెక్టార్లు బీడు భూములుగా మిగిలాయి. ఒక్క ఎకరా కూడా ఖాళీగా ఉండకూడదని కూటమి సర్కారు చెబుతున్నా.. ఆ దిశగా బీడు భూములు సాగులోకి వచ్చేలా ప్రత్యామ్నాయం చూపడం లేదు. అక్టోబర్‌ నుంచి రబీ ప్రారంభం కానుండటంతో ప్రత్యామ్నాయం కింద ఉలవ, కొర్ర, జొన్న లాంటి విత్తనాలు ఇచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదు.

సాగు గణాంకాలపై అనుమానాలు:

వేరుశనగ, కంది, ఆముదం, పత్తి లాంటి ప్రధాన పంటలు విత్తుకునేందుకు నెల రోజుల కిందటే గడువు ముగిసినా ఇప్పటికీ వారం వారం విడుదల చేస్తున్న నివేదికలో విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రతి వారం 20 నుంచి 30 వేల హెకార్లు పెంచుతూ గణాంకాలు విడుదల చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 10 నాటికి 1.68 లక్షల హెక్టార్లు, ఆగస్టు 26 నాటికి 2.21 లక్షల హెక్టార్లు, సెప్టెంబర్‌ ఒకటి నాటికి 2.44 లక్షల హెక్టార్లు, సెప్టెంబర్‌ 8న 2.56 లక్షల హెక్టార్లు... ఇలా ఖరీఫ్‌ పెరుగుతోంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రత్యామ్నాయ పంటల విస్తీర్ణం పెరగాల్సి ఉండగా.. వేరుశనగ, కంది, ఆముదం, పత్తి పెరగడం విశేషం. మరోపక్క ఈ–క్రాప్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. 2.55 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి రాగా ఇందులో సగం విస్తీర్ణం కూడా పంట నమోదు చేయని పరిస్థితి. ఈ–క్రాప్‌కు కూటమి సర్కారు ప్రాధాన్యత తగ్గించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఉలవ, పెసర, అలసంద, మినుము, కొర్ర, జొన్న, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు లాంటి ప్రత్యామ్నాయ పంటలు నామమాత్రంగా సాగులోకి వచ్చాయి.

జిల్లాలో సాగైన పంటల వివరాలు..

కంది 93,657 హెక్టార్లు

వేరుశనగ 78,131 హెక్టార్లు

పత్తి 22,687 హెక్టార్లు

మొక్కజొన్న 21,146 హెక్టార్లు

ఆముదం 14,448 హెక్టార్లు

సజ్జ 3,385 హెక్టార్లు

వరి 18,716 హెక్టార్లు

జిల్లా వ్యాప్తంగా 87 వేల హెక్టార్లు బీళ్లుగానే దర్శనం

ప్రత్యామ్నాయం చూపని కూటమి సర్కారు

ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం లెక్కలపై అనుమానాలు

వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను కుదేలు చేశాయి. ఫలితంగా ఖరీఫ్‌లో పంట వేసుకునే అవకాశాలు లేక పలువురు రైతులు తమ పొలాలను బీడుగా వదిలేశారు. ప్రత్యామ్నాయం చూపాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో అన్నదాతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement