
జాగ్రత్తగా వ్యవహరించండి : కలెక్టర్
అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో జన సమీకరణలో జాగ్రత్తలు పాటించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సూచించారు. సీఎం పర్యటనపై సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి డీఆర్‌డీఏ, మెప్మా, డ్వామా శాఖల అధికారులు, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందితో కలెక్టర్ సమీక్షించారు. జనాల తరలింపు కార్యక్రమాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించాలన్నారు. మండలాల నుంచి ఏ సమయానికి బస్సు బయలుదేరాలి అనేది ముందుగానే గుర్తించాలన్నారు. మ్యాపింగ్ ప్రకారం నిర్ధేశించిన పార్కింగ్‌కు బస్సులు వెళ్లాలన్నారు. పార్కింగ్ ప్రదేశంలోనే అందరూ దిగేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ మలోల, ఎస్‌డీసీ తిప్పేనాయక్, డీఆర్‌డీఏ పీడీ శైలజ, డ్వామా పీడీ సలీంబాషా, మెప్మా పీడీ విశ్వజ్యోతి, ఇతర అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి
కణేకల్లు: విద్యుత్ షాక్‌కు గురై ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ సురేష్ (25) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బొమ్మనహాళ్ మండలం గోనేహాళ్‌కు చెందిన సురేష్‌కు భార్య పవిత్ర, తల్లిదండ్రులు లింగమ్మ, వన్నూరుస్వామి ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎలక్ట్రీషియన్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం కణేకల్లు మండలం ఎస్‌ఆర్‌ఎన్ క్యాంపులో రైతు పొలంలో విద్యుత్ సమస్య తలెత్తడంతో మరమ్మతు చేసేందుకు వెళ్లాడు. స్టార్టర్ వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలాడు. గమనించిన రైతులు వెంటనే బళ్లారిలోని విమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై కణేకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
పాము కాటుకు చిన్నారి బలి
బ్రహ్మసముద్రం: పాము కాటుకు గురై ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లికి చెందిన హరిజన బడిగే మల్లికార్జున, మారెక్క దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి పెద్ద కుమార్తె హేమాశ్రీ (6) ఈ నెల 5న పాము కాటుకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆగమేఘాలపై కళ్యాణదుర్గంలోని ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. మూడు రోజుల అనంతరం పరిస్థితి విషమించి సోమవారం బాలిక మృతి చెందింది. సోమవారం సాయంత్రం చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు.
పోకిరీకి దేహశుద్ధి
కదిరి అర్బన్: వివాహితను వేధించిన పోకిరీకి స్థానికులు దేహశుద్ధి చేశారు. కదిరి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లమాడ మండలానికి చెందిన యువకుడు మహేష్ మద్యం మత్తులో ఓ వివాహితతో ఆమె ఇంటి వద్ద అసభ్యంగా ప్రవర్తిస్తూ తన కోరిక తీర్చాలని గొడవకు దిగాడు. గమనించిన భర్త, బంధువులు వెంటనే మహేష్‌ను పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

జాగ్రత్తగా వ్యవహరించండి : కలెక్టర్

జాగ్రత్తగా వ్యవహరించండి : కలెక్టర్