
మానిటరింగ్ టీమ్‌కు సహకరించండి
● అధికారులకు ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్: ‘జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పరిశీలనకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ జాతీయస్థాయి మానిటరింగ్ కమిటీ ఈనెల 13 వరకు జిల్లాలో పర్యటించనుంది. కమిటీకి సమగ్ర వివరాలు, సమాచారం ఇవ్వడంతో పాటు సంపూర్ణ సహకారం అందించాలి’ అని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన జాతీయస్థాయి మానిటరింగ్ బృందం రీసెర్చ్ అధికారి సాంబశివరావు, అసిస్టెంట్ రీసెర్చ్ అధికారి సబృతి నవ్యతో కలిసి ఇన్‌చార్జ్ కలెక్టర్ సోమవారం రెవెన్యూ భవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారితో మాట్లాడి విజయగాథలను బృంద సభ్యులకు తెలియజేయాలన్నారు. బృందానికి క్షేత్రస్థాయిలో అధికారులు, మండల, గ్రామ సిబ్బంది సంపూర్ణ సహకారం అందించాలన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి ఆస్వాస్ యోజన, జాతీయ సామాజిక సహాయక కార్యక్రమం, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, ప్రధాన మంత్రి గ్రామ సరోవరం పథకం తదితర పథకాల అమలును పరిశీలిస్తారన్నారు. గమనించిన అంశాలపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తారన్నారు. సమావేశంలో డ్వామా పీడీ సలీంబాషా, జెడ్పీ సీఈఓ శివశంకర్, డీపీఓ నాగరాజునాయుడు, హౌసింగ్ పీడీ శైలజ, డీఆర్‌డీఏ ఏపీడీలు గంగాధర్, సత్యనారాయణ, సర్వే ఏడీ రూప్లానాయక్, తదితరులు పాల్గొన్నారు.