
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
రాయదుర్గం టౌన్: మూడు పదుల వయసు పైబడినా పెళ్లి కాలేదన్న వేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తెలిపిన మేరకు.. రాయదుర్గంలోని మల్లాపురం ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న పరమేశ్వరప్ప, రత్నమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం తల్లి, ఎనిమిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందారు. అప్పటి నుంచి ముగ్గురు అన్నదమ్ములూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్దకుమారుడు వెంకటేశులకు వివాహమైంది. రెండో కుమారుడు జగదీష్ (33)కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే సంబంధాలు ఏవీ కుదరకపోవడంతో ఇక తనకు పెళ్లి కాదేమోనంటూ జగదీష్ తరచూ బంధువులతో చెప్పుకుని బాధపడేవాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పాము కాటుతో వృద్ధుడి మృతి
రాయదుర్గం టౌన్: పాము కాటుకు గురై ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కూలి పనులతో జీవనం సాగిస్తున్న ఎరికల కుమారస్వామి (66) ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని సీబీఎన్ కాలనీలో ఉన్న తన ఇంటి వద్ద కూర్చొని ఉండగా చేతికి పాము కాటు వేసింది. నాటు వైద్యంతో నయం చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలించకపోవడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి బంధువులు తరలించారు. పరిస్థితి విషమించి అదే రోజు అర్ధరాత్రి ఆయన మృతిచెందాడు. కాగా, కుమారస్వామికి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
స్తంభించిన తపాలా సేవలు
అనంతపురం సిటీ: తపాలా శాఖలో మరింత పారదర్శకతతో పాటు వేగవంతమైన సేవలందించే క్రమంలో కేంద్ర తపాలా శాఖ గత నెలలో 2.0 కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం మూడు రోజుల పాటు తపాలా సేవలను బంద్ చేశారు. ఆ తర్వాత సర్వర్ మొరాయింపుతో అరకొర సేవలు కొనసాగుతూ వచ్చాయి. ఈ సమస్యను అధిగమించడం సాధ్యం కాకపోవడంతో సోమవారం ఒక్కసారిగా సర్వర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రెండు హెడ్ పోస్టాఫీసులతో పాటు 64 సబ్ పోస్టాఫీసులు, 407 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో తపాలా సేవలు స్తంభించాయి. అనంతపురం, గుంతకల్లు హెడ్ పోస్టాఫీసుల్లోని వివిధ రకాల కౌంటర్లు మూతపడ్డాయి. వచ్చిన జనం వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోయారు. దూరభారం నుంచి వచ్చిన వారు సాయంత్రం వరకు వేచి చూశారు.

పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య

పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య